మూడొంతులకు ముప్పే!

తాజా వార్తలు

Published : 14/02/2021 13:23 IST

మూడొంతులకు ముప్పే!

హిమాలయాల్లో వేగంగా కరుగుతున్న మంచుతో ఉత్తరాఖండ్‌కు పెను ప్రమాదం

దేవభూమి...
మామూలుగానైతే దేవుడు కొలువై భక్తుల ప్రార్థనలు వినేభూమి!కానీ ఇప్పుడది కాలుష్యం నుంచి కాపాడమని భక్తులను ప్రార్థించే పరిస్థితి! ఇటీవలే ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలీ జిల్లాలో సంభవించిన హిమానీనద వరద ప్రారంభం మాత్రమేనని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లో మూడొంతులు ప్రమాదంలో ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఎప్పుడైనా గట్టు తెగే ముప్పు..
హిమాలయ పర్వత శ్రేణుల్లో భారత్‌వైపు సుమారు 5వేల హిమానీనదాలు ఉన్నట్లు శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. వీటిలో ఉత్తరాఖండ్‌లో ఉన్న 500కుపైగా హిమానీనదాలు ఎప్పుడైనా గట్టు తెంచుకోవచ్చన్నది వారి ఆందోళన!
బలహీనమైన ఆనకట్టలు..

ఉత్తరాఖండ్‌లోని 78 తాలూకాలకు గాను... 26 తాలూకాలకు ఈ హిమానీనదాల వరద ముంపు పొంచి ఉంది. ముఖ్యంగా భాట్‌వాఢీ, జోషిమఠ్, ధార్చులా ప్రాంతాల్లో ఈ వరదలు ఎక్కువ ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడొంతుల తటాకాలపై ఏర్పాటు చేసిన ఆనకట్టలు బలహీనమైనవని.. ఇవి త్వరగా కొట్టుకుపోయి వరదలకు కారణం అవుతాయని చెబుతున్నారు.
పెరుగుతున్న మంచునీటి సరస్సులు
వాతావరణ మార్పులతో పాటు రోజురోజుకూ పెరుగుతున్న భూతాపం కారణంగా పర్వత శ్రేణుల్లోని మంచు కరుగుతోంది. ఇలా కరిగిన నీటితో మంచు కొండల మధ్య సరస్సులు ఏర్పడుతున్నాయి. వాతావరణంలో సంభవించే మార్పుల ఫలితంగా ఇవి ఒక్కసారిగా కట్టలు తెంచుకుని కిందికు వరదగా దూసుకొస్తున్నాయి. ఇలాంటి మంచునీటి తటాకాలు 1990-2018 మధ్య 48% పెరిగినట్లు నేచర్‌ జర్నల్‌ నివేదిక పేర్కొంది. 
కాలుష్యం కురుస్తోంది

అమర్‌నాథ్‌ యాత్ర, బద్రీనాథ్, కేదార్‌నాథ్, చార్‌దామ్, మానస సరోవర్‌ యాత్రల పేరిట ఏటా లక్షల మంది పర్యాటకులు హిమాలయ శ్రేణులకు వస్తుంటారు. దీంతో పర్యాటక వ్యవస్థ ఆయా ప్రాంతాల్లో విపరీతంగా విస్తరించింది. పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఏర్పడ్డ వసతి సదుపాయాలతోపాటు, రవాణా, వాహనాల రాకపోకలు పెరగడం, అడవులు కొట్టేయడం, ఇబ్బడిముబ్బడిగా వచ్చిన జలవిద్యుత్తు ప్రాజెక్టులు... అన్నీ కలిసి అందమైన హిమాలయాలపై కాలుష్యపు మంచును కురిపిస్తున్నాయి. 2000 నుంచి 2016 మధ్య హిమాలయాల్లో భూతాపం 0.4 డిగ్రీ సెల్సియస్‌ నుంచి 1.4 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే 10వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కోసం సుమారు 70కిపైగా జలవిద్యుత్తు కేంద్రాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఆ బాధ్యత పర్యాటకులపైనా ఉంది ఈ పర్వత శ్రేణులను, పవిత్రమైన హిమాలయాలను రక్షించుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపైనే కాకుండా వచ్చీపోయే పర్యాటకులపై కూడా ఉంది.-పర్యావరణ  నిపుణులు! 

ఇవీ చదవండి..

ఆ తల్లి ఫోన్‌ కాల్‌.. 25 మందిని కాపాడింది

వైరల్‌గా మారిన జల ప్రళయం వీడియోలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని