
తాజా వార్తలు
కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!
బెంగళూరు(మల్లేశ్వరం), న్యూస్టుడే: ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి ఒకరు తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని బెంగళూరులో ఓ మహిళ ఆరోపించారు. మంత్రి తనతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించిన ఆమె... సంబంధిత సీడీని సహచట్టం కార్యకర్త దినేశ్ కల్లహళ్లికి చేరవేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని, తనకు, బాధిత మహిళకు రక్షణ కల్పించాలని కోరుతూ బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్పంత్ను మంగళవారం సాయంత్రం దినేశ్ కోరారు. కొన్ని టీవీ ఛానెళ్లకు సీడీలను పంపించిన దినేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సంబంధిత మంత్రి టీవీ ఛానెళ్ల ప్రతినిధులతో మాట్లాడుతూ... తన చిత్రాలను ఉపయోగించి ఎవరో సీడీని రూపొందించారని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు వెలుగులోని వస్తాయని, కేసును ఎదుర్కొంటానని, వెనుకంజ వేయబోనని ప్రకటించారు. మరోవైపు మంత్రి నిజంగా తప్పు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఇక మంత్రిని లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, విచారణకు సహకరించాలని డిమాండు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం రాత్రి బెంగళూరులో ధర్నాకు దిగారు.