గబ్బిలాలు.. శీతలీకరించిన ఆహారం..
close

తాజా వార్తలు

Updated : 27/03/2021 15:55 IST

గబ్బిలాలు.. శీతలీకరించిన ఆహారం..

ఇవే కరోనా మూలాలు 
నిపుణుల పరిశోధనలో తేలింది ఇదే: చైనా 

బీజింగ్‌: కొవిడ్‌-19 కారక కరోనా వైరస్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం చైనాలో దర్యాప్తు జరిపింది. ఆ నివేదిక ఇంకా వెలువడాల్సి ఉంది. ఆలోగానే ఈ అంశంపై చైనా అధికారులు శుక్రవారం పలు దేశాల దౌత్యవేత్తలతో సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ పరిశోధనలో తేలిన అంశాలివీ అంటూ ముందస్తు వివరణ ఇచ్చేశారు. 

2019 చివర్లో కరోనా వైరస్‌ కేసులు మొట్టమొదటిసారిగా చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వోకు సంబంధించిన అంతర్జాతీయ నిపుణుల బృందం జనవరిలో వుహాన్‌లో పర్యటించింది. చైనా శాస్త్రవేత్తలతో కలిసి వారు పరిశీలనలు సాగించారు. తుది నివేదికపై రెండు పక్షాలూ ఆమోదం తెలపాల్సి ఉంది. అది ఎప్పుడు వెలువడుతుందన్నది అంతుచిక్కకుండా ఉంది. డబ్ల్యూహెచ్‌వో అధ్యయనంపై చైనా ప్రభావం, పరిశోధనలో తేలిన అంశాల స్వతంత్రతపై అమెరికా సహా పలు దేశాలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో చైనా.. తాజా సమావేశాన్ని నిర్వహించింది. దీనికి 50 దేశాలు, అరబ్‌ దేశాల లీగ్, ఆఫ్రికన్‌ సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. కరోనా విషయంలో తాము పారదర్శకంగా వ్యవహరించామని చైనా విదేశాంగ శాఖ అధికారి యాంగ్‌ టావో తెలిపారు. కరోనా వైరస్‌ వుహాన్‌ నగరంలోకి ప్రవేశించడానికి దోహదపడినట్లుగా భావిస్తున్న నాలుగు మార్గాలను నిపుణులు పరిశీలించారని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఫెంగ్‌ జిజియాన్‌ పేర్కొన్నారు. ‘‘1. వైరస్‌తో కూడిన గబ్బిలం ద్వారా మానవుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడం. 2. గబ్బిలం నుంచి ఒక మధ్యంతర జంతువులోకి వైరస్‌ వ్యాపించి.. దాని నుంచి మానవుల్లోకి విస్తరించడం. 3. శీతలీకరించిన ఆహార ఉత్పత్తుల ద్వారా వ్యాపించడం 4. వుహాన్‌లో వైరస్‌లపై పరిశోధించే ల్యాబ్‌ ద్వారా వ్యాప్తి. వీటిపై లోతైన చర్చ తర్వాత.. గబ్బిలం ద్వారా నేరుగా లేదా మరో జీవి ద్వారా కానీ, శీతలీకరించిన ఆహారం ద్వారా కానీ ఈ వ్యాధి మానవుల్లోకి ప్రవేశించి ఉంటుందని నిపుణులు సూత్రీకరించారు. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి ఇది వ్యాపించడానికి ఆస్కారం లేదని తేల్చారు’’ అని పేర్కొన్నారు. తమపై నిరాధార ఆరోపణల ద్వారా కరోనా మూలాలపై జరిగే పరిశోధనను రాజకీయం చేయడానికి కొన్ని దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. సదరు పరిశోధన.. శాస్త్రీయమైన అంశమని తెలిపింది. సహకారం ద్వారా శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టాలని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో నివేదికలోని అంశాలు, వాటి అనువాదంపై నిపుణులు ఇంకా చర్చిస్తున్నారని వివరించింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని