Covid కల్లోల‘మే’

తాజా వార్తలు

Updated : 01/05/2021 08:15 IST

Covid కల్లోల‘మే’

ముందే హెచ్చరించిన ప్రత్యేక కమిటీ

పట్టించుకోని కేంద్రం

ఈనాడు, దిల్లీ: దేశంలో ప్రస్తుత కరోనా కల్లోలాన్ని, రోజువారీ కేసుల సంఖ్యను కేంద్రం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ ముందే అంచనా వేసింది. సకాలంలో నివారణ చర్యలు తీసుకోకుంటే.. వైరస్‌ రెండో దశలో విలయం సృష్టిస్తుందంటూ మార్చి 9నే కేంద్రాన్ని హెచ్చరించింది. మే నెల ప్రారంభానికి రోజువారీ కేసులు 3.8 లక్షల నుంచి 4.4 లక్షలకు చేరుకుంటాయని ఆనాడే చెప్పింది. మే మధ్యకాలానికి క్రియాశీల కేసుల సంఖ్య 33-35 లక్షలకు చేరుతాయని అంచనా వేసింది. అయితే కేంద్రం ఈ విషయాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదని ఇప్పుడు స్పష్టమవుతోంది. రెండో దశ వ్యాప్తిని కొట్టిపారేసే తరహాలోనే వ్యవహరించింది. కరోనా నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం.. ఈ ఏడాది ప్రారంభంలోనే ఏడుగురు నిపుణులతో ‘నేషనల్‌ కొవిడ్‌-19 సూపర్‌ మోడల్‌ కమిటీ’ని నియమించింది. ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ ఎం.విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో ఐఐటీ ఖరగ్‌పుర్‌ ప్రొఫెసర్‌ ఎం.అగర్వాల్, వెల్లూర్‌ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ వైరాలజీ ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ తదితరులున్నారు. ఈ కమిటీ ఇప్పటికే మనుగడలో ఉంది. రెండో దశ వ్యాప్తిపై మార్చి 9న ఈ కమిటీ కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. అప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కేరళలో రెండో దశ ప్రారంభమైందని, తక్షణమే నివారణ చర్యలు తీసుకోకుంటే దేశవ్యాప్తం అవుతుందని హెచ్చరించింది. మే నాటికి రోజువారీ కేసులు 4 లక్షలకు చేరుతాయని సరిగ్గానే లెక్క కట్టింది. అయితే హరిద్వార్‌లో జరిగిన కుంభమేళా, 4 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికలకు కరోనా రెండోదశ వ్యాప్తికి సంబంధం ఉంటుందని ఆ కమిటీ చెప్పలేదు. 
అంగీకరించని అధికారులు
కొవిడ్‌-19 సూపర్‌ మోడల్‌ కమిటీ హెచ్చరికను కేంద్రం పెడచెవిన పెట్టిందనడాన్ని.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం అధికారులు అంగీకరించడం లేదు. ‘‘ముందే హెచ్చరించడం, కేసుల వ్యాప్తి పరిధిని అంచనా వేయడంలో వ్యత్యాసం ఉంది. ఏదోక సమయంలో రెండో వేవ్‌ వస్తుందని అందరికీ తెలిసినప్పటికీ.. ఈ స్థాయిలో కేసులు పెరుగుతాయని ఎవరూ అంచనా వేయలేదు’’ అని ఓ అధికారి చెప్పారు. ప్రస్తుత పరిస్థితిపై కమిటీ సభ్యుడొకరు స్పందించారు. ‘‘దేశంలో ఎన్నికల ప్రచారానికి ముందే.. కొవిడ్‌ కేసులు పెరగడం మొదలైంది. మార్చి 11న కుంభమేళా మొదలయ్యేసరికే రెండో దశ వ్యాప్తి దేశాన్ని చుట్టుముట్టింది. ప్రజలు నిబంధనల్ని పెడచెవిన పెట్టడం ఎక్కువైంది. నిర్లక్ష్యంగా, గుంపులుగా తిరగడం, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు ఎక్కువగా జరగడం కూడా వైరస్‌ వ్యాప్తికి కారణమైంది’’ అని వివరించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని