Covid వేళ.. ఫోనెత్తకుంటే గుబులే!
close

తాజా వార్తలు

Updated : 07/05/2021 14:23 IST

Covid వేళ.. ఫోనెత్తకుంటే గుబులే!

కరోనా భయంతో బంధువులు, స్నేహితుల్లో ఆందోళన
అపార్థాలకు దారితీస్తున్న పరిస్థితులు

ఈనాడు, హైదరాబాద్‌:  కరోనా పాజిటివ్‌ వచ్చి ఉంటుందా?.. వారి కుటుంబంలో ఎవరైనా ఆసుపత్రి పాలయ్యారా?.. ఫోన్‌కు స్పందించకున్నా.. తిరిగి కాల్‌ చేయకపోయినా.. స్విచ్చాఫ్‌ చేసినా.. బంధువులు, మిత్రుల మెదళ్లలో రేగుతున్న సందేహాలివి. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవారు కొద్ది రోజులు ఫోన్‌ చేయకున్నా.. తాము చేస్తే ఫోన్‌ తీయకున్నా మనసు కీడు శంకిస్తోంది. అసలు విషయాన్ని కనుక్కోవడానికి ఉమ్మడి స్నేహితులు, ఇతర బంధువులను ఆరా తీస్తున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఎక్కువ మంది ఇదే తరహాలో యోచిస్తున్నారు. వాస్తవ పరిస్థితి అంతకంటే భిన్నంగా ఏమీ లేదు. కరోనా లక్షణాలు కనిపించగానే టెస్టు చేయించుకోవడం, వైద్యుల వద్ద ఉన్నా ఫలితం ఏమొస్తుందో? ఏం చెబుతారో?.. అన్న ఆందోళన.. అందుకే తర్వాత మాట్లాడదామని ఫోన్లకు స్పందించడం లేదు. పాజిటివ్‌ వచ్చి హోం ఐసొలేషన్‌లో ఉన్నా ఔషధాలు సమకూర్చుకోవడం, ఇతర ఏర్పాట్లు చేసుకోవడం వంటి కారణాలతో పాటు విశ్రాంతి తీసుకోవాలని భావించి ఫోన్లకు బదులివ్వడం లేదు. అలాంటి సమయంలో మిత్రులు, బంధువులు చేస్తున్న ఫోన్లకు జవాబు ఇక్వకుంటే కరోనా వచ్చి ఉంటుందేమోనని సందేహిస్తున్నారు. కొందరు తమకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని వాట్సప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నారు. అది చూసినవారు ఫోన్లు చేయడం మాని, త్వరగా కోలుకోవాలని మెసేజ్‌ పెడుతున్నారు. షాపులు ఒక్క రోజు తెరవకున్నా ఆ వ్యాపారులకు కరోనా వచ్చి ఉంటుందేమోనని జనం అనుమానిస్తున్నారు.

అపార్థాల వెనక.. అధిక శాతం నెగెటివ్‌ ఆలోచనలు

కొందరు ఫోన్‌ చేసినా జవాబు ఇవ్వకుంటే అపార్థం చేసుకుంటున్నారు. ‘కరోనాతో అయిదు రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నా. చికిత్స పొందుతుండగా ఒక మిత్రుడు ఫోన్‌ చేశాడు.. ఆ పరిస్థితిలో నేను స్పందించలేదు. ఆసుపత్రి నుంచి వచ్చాక తనకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తీయలేదు.. తర్వాత ఫోనెత్తాక నేనంటే లెక్కలేదా అని తిట్టాడు. అసలు విషయం చెబితే.. సారీ రా అంటూ చిన్నబుచ్చుకున్నాడు’ అని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒకరు చెప్పారు.

దీనిపై సైకాలజిస్టు జవహర్‌లాల్‌ నెహ్రూ మాట్లాడుతూ.. సహజంగా మనిషికి వచ్చే ఆలోచనల్లో 90 శాతం నెగెటివ్‌గానే ఉంటాయన్నారు. తమకు పాజిటివ్‌ నిర్ధారణ అయిందని చెప్పుకోవడానికి ఎవరూ సంకోచించాల్సిన అవసరం లేదన్నారు. వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టుకోవచ్చని, దానివల్ల ముఖ్యులు, అత్యవసరమైతేనే ఫోన్లు చేస్తారని చెప్పారు. ఇబ్బంది లేకుంటే రక్త సంబంధీకులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో మాట్లాడితే కరోనా భయం కూడా పోతుందన్నారు. ఖాళీగా రోజంతా గదిలో ఒంటరిగా ఉండటం ఇతరత్రా మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని