టీకాల పేటెంట్‌ రద్దయ్యేనా?
close

తాజా వార్తలు

Updated : 08/05/2021 09:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకాల పేటెంట్‌ రద్దయ్యేనా?

వ్యాక్సిన్‌ చౌకగా... చకచకా కావాలంటే తప్పనిసరి 

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ నియంత్రణ... రోగులకు చికిత్సల పోరు ఒకవంకైతే.... తెరవెనకాల దేశాల మధ్య మరో పోరు సాగుతోంది! అదే టీకా పేటెంట్ల రద్దు! అభివృద్ధి చెందిన దేశాలు, వాటి బడా ఫార్మా కంపెనీలకు...  అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య సాగుతున్న కనిపించని యుద్ధమిది! అసలు ఈ పేటెంట్‌ పోరాటం ఏంటి? ఇందులో ఎవరి పాత్రేంటి? ఎవరెటువైపున్నారు? ఏమైతే  ఏమౌతుంది?... చూద్దాం రండి!

ఏంటీ పేటెంట్‌?

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒప్పందం ప్రకారం ఎవరైతే ఓ వస్తువును ఉత్పత్తి చేస్తారో వారికి ఆ వస్తువుపై మేథోపరమైన హక్కులు (పేటెంట్‌) ఉంటాయి. అనుమతి లేకుండా ఇతరులు వాటిని ఉత్పత్తి చేయటానికి వీల్లేదు. ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, న్యాయ వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కరోనా టీకాలకూ ఇదే వర్తిస్తుంది. వ్యాక్సిన్లను తయారుచేసిన ఫార్మా కంపెనీలకు వాటిపై పేటెంట్లు లభించాయి. అంటే టీకాలపై వాటిదే గుత్తాధిపత్యం! కరోనా యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నవేళ ఇలా పేటెంట్లు అంటూ కొంతమంది గుప్పిట్లో ఈ టీకాలను ఉంచకుండా.... వీటిపై పేటెంట్లను ఎత్తేసి... అంతా ఎక్కడికక్కడ ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు కల్పించాలన్నది డిమాండ్‌!

అమెరికా వద్ద అధిక నిల్వలు

కొవిడ్‌ టీకాలను వాటి పేటెంట్లు ఉన్న కంపెనీలు మాత్రమే తయారుచేస్తున్నాయి. భారత్‌లో వేలసంఖ్యలో ఉత్పత్తి చేసే కంపెనీలున్నా... పేటెంట్‌ ఉన్న రెండంటే రెండు కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్లు తయారుచేస్తున్నాయి. ఫలితంగా అందరికీ అందివ్వలేని పరిస్థితి. మరోవైపు అమెరికా భారీస్థాయిలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి,  తమ జనాభాకు సరిపోయేకంటే ఎక్కువగా డోసులను నిల్వ చేసుకుంది. ఒకవంక చాలా దేశాల్లో వేలమంది చనిపోతుంటే మరోవైపు ఇలా వృథాగా నిల్వ రూపంలో ఉండిపోతున్నాయి. 

తాజాగా బైడెన్‌ ప్రకటనతో... 

ఇన్నాళ్లూ పేటెంట్ల రద్దును వ్యతిరేకించిన అమెరికా... తాజాగా భారత ప్రతిపాదనకు మద్దతు తెలిపింది. బైడెన్‌ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరును మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు.

పేటెంట్లు రద్దయితే ఏమౌతుంది?

పేటెంట్ల రద్దు అంటే... వాటి తయారీ ఫార్ములాను అందరికీ అందించొచ్చు. ప్రపంచంలోని చాలా ఫార్మా కంపెనీలు ఈ టీకాలను తయారుచేయొచ్చు. తద్వారా చకచకా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ... అదీ చౌకగా అందటానికి అవకాశం ఉంటుంది.

డబ్ల్యూటీవోలో  నిర్ణయం జరగాలి

పేటెంట్లు రద్దుపై డబ్ల్యూటీవో సభ్యదేశాలు ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మార్చిలోనే దీనిపై చర్చ పెట్టగా... బ్రిటన్, ఐరోపా సంఘం దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వ్యతిరేకించాయి. రద్దును అడ్డుకున్నాయి. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. జర్మనీ బహిరంగంగానే పేటెంట్ల రద్దును వ్యతిరేకించింది. మరోవైపు ఫ్రాన్స్‌ రద్దుకు మద్దతివ్వటం గమనార్హం.

ఎప్పటికయ్యేను?

పేటెంట్లను ఎత్తివేసే ప్రతిపాదనకు మద్దతిస్తామని... దీనిపై రాతపూర్వక సంప్రదింపులకు తాము మొగ్గుచూపుతున్నామని అమెరికా ప్రకటించింది. రాతపూర్వక సంప్రదింపులంటే... ప్రతి దేశమూ తమ వాదనను రాతపూర్వకంగా సమర్పిస్తుంది. అంతిమంగా ఓ ఏకాభిప్రాయానికి వచ్చి... దాన్నీ రాతపూర్వకంగానే వెల్లడిస్తారు. డబ్ల్యూటీవోలోని 164 దేశాలూ అంగీకరిస్తేనే అది తీర్మానం అవుతుంది. ఏ ఒక్కరు వ్యతిరేకించినా కాదు. ఒకవేళ అంతా అంగీకరిస్తారనుకున్నా, వచ్చే నవంబరులోపు ఈ సంప్రదింపులు తేలితే అది గొప్పే! పేటెంట్లను ఎత్తివేసినా వాటి సాంకేతిక ఫార్ములాను పంచుకోకుంటే... ఉత్పత్తి వేగంగా జరగదు. కొత్త కంపెనీలు ఆ ఫార్ములాపై పనిచేసి... ఉత్పత్తి చేయటానికి మళ్లీ సమయం పడుతుంది.

గతంలోనూ ఎత్తేశారు

ఔషధాలపై పేటెంట్లను ఎత్తివేయటం కొత్తేమీ కాదు. 2001లో డబ్ల్యూటీవో పేదదేశాలకు ఔషధాల తయారీపై పేటెంట్లను ఎత్తేసింది. 2015లో ఈ ఎత్తివేతను పొడిగించారు. 

దేశాలు సొంతంగా ఏమీ చేయలేవా?

పేటెంట్లను పరిరక్షించటం ప్రభుత్వాల బాధ్యతే. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ముఖ్యంగా కరోనాలాంటి విపత్కర సందర్భాల్లో పేటెంట్లను పక్కనబెట్టి ప్రజల విస్తృత ప్రయోజనాల రీత్యా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

భారత్‌ ముందు ఆ అస్త్రం!

కంపల్సరీ లైసెన్సింగ్‌ అనేది ఒక అవకాశం. పేటెంట్‌ ఉన్నవారి అనుమతి లేకుండానే... ఔషధాలను ఉత్పత్తి చేయటానికి... కంపెనీలకు రెగ్యులేటర్‌ అనుమతి మంజూరు చేసే పద్దతి ఇది! జాతీయ అత్యయిక స్థితి, నిజంగా... అత్యవసర పరిస్థితి, ప్రజా ప్రయోజనాలు(వాణిజ్యేతర).. ఈ మూడు పరిస్థితుల్లో కంపల్సరీ లైసెన్సింగ్‌ను కేంద్రం వినియోగించుకోవచ్చు. అత్యయిక పరిస్థితుల్లో కంపల్సరీ లైసెన్సింగ్‌ను జారీ చేయటానికి డబ్ల్యూటీవో కూడా అంగీకరిస్తుంది. పేటెంట్‌ యజమానికి తగిన పరిహారం చెల్లిస్తే సరిపోతుంది. ఇలా జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి కూడా!

కొవాగ్జిన్‌ కేంద్రం చేతిలోనే... 

మిగిలిన టీకాలన్నీ విదేశాలవి. వాటికి పేటెంట్‌ గోల ఉంది. కానీ మనదేశంలో తయారైన కొవాగ్జిన్‌ పూర్తిగా మన ఉత్పత్తి. భారత్‌ బయోటెక్, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐసీఎంఆర్‌లు తయారు చేసిందిది. దీనిపై ప్రభుత్వానికి పూర్తి హక్కులున్నాయి. ఈ టీకా ఉత్పత్తికి సంబంధించిన లైసెన్సును దేశంలోని ఇతర కంపెనీలకు కూడా ఇస్తే చకచకా ఉత్పత్తి అవటానికి వీలు కలుగుతుందన్నది నిపుణుల మాట.

ఎవరెటు?

పేటెంట్ల రద్దు కోరుతున్నవారు... అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున భారత్, దక్షిణాఫ్రికాతో పాటు... అనేక మానవ హక్కుల సంస్థలు 

వ్యతిరేకిస్తున్నవారు... 

అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడాలాంటి దేశాలు, పరిశోధనల్లో పెట్టుబడులు పెట్టే మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తదితరులు, వ్యాక్సిన్‌ను తయారుచేసిన ఫైజర్, ఆస్ట్రాజెనికా కంపెనీలు 

రద్దు వద్దంటున్నవారి వాదన ఇదీ.. 

పేటెంట్లను రద్దు చేస్తే... పరిశోధనలకు గట్టి దెబ్బ తగులుతుంది. 
మునుముందు పరిశోధనలకు ఎవ్వరూ ముందుకు రారు. 
వ్యాక్సిన్ల నాణ్యత తగ్గిపోతుంది. 
రష్యా, చైనాలాంటి దేశాలు ఈ సాంకేతికతను తమ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తాయి. 
పేటెంట్ల రద్దు.. వ్యాక్సిన్ల నాణ్యత, రక్షణపై ప్రజల్లో నమ్మకాన్ని పోగొడుతుంది.

రద్దు కోరుతున్నవారి వాదన ఇదీ.. 
వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రజలందరికీ త్వరగా వ్యాక్సిన్లు వేయాలి. 
టీకాలు ఆలస్యమైతే... ఇప్పుడు వేసిన వ్యాక్సిన్ల ప్రభావం మరో కొద్దినెలల్లో లేదా ఏడాదిలో పనికిరాకుండా పోవచ్చు. 
కాబట్టి వ్యాక్సిన్ల వేగాన్ని పెంచాలి. అందుకోసం పేటెంట్లను ఎత్తేసి ఉత్పత్తిని పెంచాలి. 
పేటెంట్లను ఎత్తేస్తే వేగంగా అన్ని దేశాల్లోని ప్రజలకు అందివ్వటమే కాకుండా... చౌకగా కూడా ఇవ్వటానికి వీలవుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని