Vaccine: తగ్గుతున్న వ్యాక్సినేషన్‌ వేగం

తాజా వార్తలు

Updated : 27/05/2021 11:25 IST

Vaccine: తగ్గుతున్న వ్యాక్సినేషన్‌ వేగం

ఈనాడు, దిల్లీ: దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగం వారం వారం తగ్గుతూ వస్తోంది. జనవరిలో ప్రారంభమైన టీకాల పంపిణీ తొలివారంలో (16-22 తేదీల మధ్య) 12,43,013 మందికి మాత్రమే టీకా అందించగలిగారు. మార్చి నుంచి క్రమంగా కేసులు అధికం కావడం, ఏప్రిల్‌ కల్లా ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు, ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయడంతో ఎక్కువ మంది టీకా తీసుకోవడానికి ముందుకొచ్చారు. అప్పటికి వ్యాక్సిన్‌ నిల్వలు కూడా దండిగా ఉండటంతో కార్యక్రమం వేగంగా సాగింది. ఈమేరకు ఏప్రిల్‌ 3-9 తేదీల్లో ఏకంగా 2,47,46,875 డోసులు అందించే స్థాయికి చేరింది. ఆ వారంలో రోజుకు సగటున 35.35 లక్షల చొప్పున టీకాలు వేశారు. తర్వాతి నుంచి వారం వారం ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. మే 1 నుంచి టీకా విధానంలో మార్పులు చేసి 18-44 ఏళ్ల మధ్యవారికి అవకాశం కల్పించడంతో పాటు, దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం టీకాల్లో సగం మాత్రమే తాము ఉచితంగా పంపిణీ చేస్తామని, మిగతా సగాన్ని రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేసుకోవాలని చెప్పడం టీకా విధానాన్ని కుదిపేసింది.

దేశంలో టీకాలు తగిన సంఖ్యలో ఉత్పత్తి కాకున్నా 18-44 ఏళ్లలోపు వారికి అనుమతించడంతో కొరత తీవ్రమైంది. ఈ వయసులోపు వారు కొవిన్‌ యాప్‌లో పేర్లు నమోదు చేసుకొని, అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలన్న షరతు విధించడం, ఆ పోర్టల్‌ అనుకున్నవిధంగా పనిచేయకపోవడంతో పరిస్థితి గందరగోళంగా తయారై వ్యాక్సిన్‌ వేగం క్రమంగా తగ్గుతూ వచ్చింది. మే 1-7 తేదీల మధ్య 1.21 కోట్ల వ్యాక్సిన్లు వేయగా, 15-21 తేదీల నాటికి అది 92.10 లక్షలకు తగ్గిపోయింది. ఇప్పుడు వ్యాక్సిన్ల కొరతతో చాలా రాష్ట్రాల్లో టీకా కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. పలు రాష్ట్రాల్లో ప్రజలు అధిక సంఖ్యలో ముందుకొస్తున్నా కొరత కారణంగా డిమాండ్‌ తీర్చలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు-డిసెంబరు మధ్యకాలంలో దేశంలో 216 కోట్ల డోసుల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో భరోసా పెంచే ప్రయత్నం చేసింది. అయితే ప్రస్తుతానికి నెలకు 8 కోట్ల డోసులు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని