Corona: ఇన్‌ఫెక్షన్‌ + టీకా = జీవితకాల రక్షణ

తాజా వార్తలు

Updated : 01/06/2021 10:09 IST

Corona: ఇన్‌ఫెక్షన్‌ + టీకా = జీవితకాల రక్షణ

తాజా అధ్యయనాల్లో వెల్లడి

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 మహమ్మారి కట్టడిపై రెండు పరిశోధనలు సరికొత్త ఆశలు చిగురింపచేశాయి. ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నవారు లేదా కరోనా టీకా తీసుకున్నవారికి ఈ వ్యాధి నుంచి జీవితకాల రక్షణ లభించొచ్చని అవి పేర్కొన్నాయి. అయితే మరోసారి ఆ ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా ఇవి పూర్తిస్థాయిలో కాపాడతాయని నిర్ధారణగా చెప్పలేమని శాస్త్రవేత్తలు తెలిపారు. కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలను దీర్ఘకాలం పాటు శరీరం ఉత్పత్తి చేయవచ్చన్న ఆశలకు ఈ పరిశోధనలు బలం చేకూర్చాయని చెప్పారు.  
కరోనా రీఇన్‌ఫెక్షన్లు శాస్త్రవేత్తలు, ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో ఉత్పత్తయ్యే నిర్దిష్ట యాంటీబాడీలు స్వల్పకాలమే మనుగడలో ఉంటాయా అన్న ప్రశ్నలు వీటివల్ల ఉత్పన్నమయ్యాయి. ఈ వ్యాధి నివారణకు ఏటా లేదా ఆరు నెలలకోసారి టీకా పొందాల్సిన అవసరం ఏర్పడుతుందా అన్న విశ్లేషణలూ మొదలయ్యాయి. తాజా అధ్యయనాలు మాత్రం.. ఈ రోగనిరోధక రక్షణ కనీసం ఏడాది పాటు కొనసాగుతుందని పేర్కొన్నాయి. కొందరిలో ఇది కొన్ని దశాబ్దాలు కూడా కొనసాగొచ్చని తెలిపాయి. కరోనాను నిర్వీర్యం చేసే యాంటీబాడీల ఉత్పత్తిలో ఎముక మజ్జకూ పాత్ర ఉన్నట్లు తేలడమే ఈ అంచనాలకు ప్రాతిపదిక. రెండు అధ్యయనాల్లోనూ శాస్త్రవేత్తలు.. ఎముక మజ్జలోని రోగనిరోధక కణాలను పరిశీలించారు. కరోనాను గుర్తుపెట్టుకొని, భవిష్యత్‌లో అది దాడికి ప్రయత్నిస్తే వెంటనే తిప్పికొట్టే ‘టి కణాల’నూ రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేస్తుందని కూడా తేలడం ఊరట కలిగిస్తోంది. కరోనా వైరస్‌లోని కొంత భాగాన్ని రోగ నిరోధక వ్యవస్థ తనలో భద్రపరచుకుంటుందని, దాని ఆధారంగా రోగ నిరోధక కణాలు ఈ వైరస్‌పై పోరులో ఎప్పటికప్పుడు శిక్షణ పొందుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. యాంటీబాడీల ఉత్పత్తిలో ఎముక మజ్జ ప్రమేయం ఉండటం వల్ల.. కరోనాలో కొత్త రకాలనూ ఎదుర్కొనే సామర్థ్యమూ  శరీరానికి లభిస్తుందని పరిశోధకులు చెప్పారు. టీకా పొందిన వారితో పోలిస్తే కొవిడ్‌ నుంచి కోలుకున్నవారికి భవిష్యత్‌  ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే సమర్థత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకొని, ఆ తర్వాత టీకా పొందిన వారిలో రోగనిరోధక స్పందన చాలా మెరుగ్గా ఉంటుందని వివరించారు. వారికి బూస్టర్‌ వ్యాక్సిన్ల అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని