మహమ్మారులకు తొలి 100 రోజుల్లోనే కళ్లెం 
close

తాజా వార్తలు

Published : 13/06/2021 11:20 IST

మహమ్మారులకు తొలి 100 రోజుల్లోనే కళ్లెం 

 బ్రిటన్‌లో జంతువుల టీకా అభివృద్ధి కేంద్రం
జి-7 దేశాల భేటీలో నిర్ణయం

లండన్‌: భవిష్యత్తులో జంతువుల నుంచి మనుషులకు వైరస్‌లు వ్యాప్తి చెందకుండా కళ్లెం వేసే చర్యల్లో భాగంగా బ్రిటన్‌లో ‘జంతువుల టీకా అభివృద్ధి కేంద్రం’ ఏర్పాటు కానుంది. భవిష్యత్తులో ఎప్పుడు కొత్త రకం వైరస్‌ బయటపడినా దానిని కీలకమైన తొలి 100 రోజుల్లోనే నియంత్రించగలిగేలా వివిధ రకాల చర్యలు చేపట్టాలని జి-7 దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ‘ప్రపంచ ఆరోగ్య ప్రకటన’ను ఆదివారం వెలువరించనున్నాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌ దేశాలతో పాటు భారత్‌ సహా వర్చువల్‌ విధానంలో పాల్గొంటున్న ఇతర దేశాలూ దీనికి అంగీకారం తెలిపాయి. సమర్థవంతమైన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం ద్వారా కరోనాపై పోరులో ప్రజల చేతికి అస్త్రాలు అందించిన విషయాన్ని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గుర్తుచేశారు. ఇలాంటి మహమ్మారులు మళ్లీమళ్లీ విరుచుకుపడకుండా చూడాలంటే గత 18 నెలల అనుభవాలతో ఈసారి మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మనకు తెలియకుండానే వైరస్‌ బారిన పడే పరిస్థితిని పునరావృతం కానివ్వరాదని ప్రముఖ ప్రజాస్వామ్య దేశాలన్నీ తొలిసారిగా ఒక్కతాటిపైకి వచ్చాయని చెప్పారు.

చైనాకు దీటుగా అడుగులు

ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం కోసం చైనా వేస్తున్న అడుగులకు దీటుగా భారీ ఎత్తున మౌలిక సదుపాయాల విస్తరణ ప్రణాళికను వర్ధమాన ప్రపంచం కోసం సిద్ధం చేయాలని జి-7 దేశాధినేతలు నిర్ణయించారు. మానవ హక్కుల్ని కాలరాస్తున్న విషయంలో చైనాకు ఎలా కళ్లెం వేయాలన్న విషయంలో మాత్రం వెంటనే ఏకాభిప్రాయం కుదరలేదు. చైనాకు అడ్డుకట్ట విషయంలో శనివారం నాటి తొలివిడత భేటీలో అమెరికాకు మద్దతుగా కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్‌ నిలిచాయి. జర్మనీ, ఇటలీ, ఈయూ మాత్రం కొంత తటపటాయించాయి. జి-7 భేటీ సందర్భంగా జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భేటీ అయ్యారు. 
bమరోవైపు.. జి-7 సదస్సు జరుగుతున్న చోట వందల సంఖ్యలో పర్యావరణ ఉద్యమకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వాతావరణ మార్పులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని