UP: యూపీలో భాజపా చిరు వ్యూహం
close

తాజా వార్తలు

Published : 14/06/2021 12:43 IST

UP: యూపీలో భాజపా చిరు వ్యూహం

వెనుకబడిన సామాజిక వర్గాలపై కన్ను
అప్నాదళ్, నిషాద్‌ పార్టీలకు మంత్రి పదవులు!
 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహరచన

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతోంది. వివిధ కులాలను, వర్గాలను ఆకర్షించే పనిలో ఆ పార్టీ కీలక నాయకులు నిమగ్నమయ్యారు. అసంతృప్త వర్గాలకు చేరువయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జితిన్‌ ప్రసాద కాషాయ కండువా కప్పుకోవడం యూపీ భాజపాలో ఉత్సాహాన్ని నింపింది. ఈ చేరికతో చాన్నాళ్ల నుంచి అసంతృప్తిగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం మళ్లీ పార్టీకి దగ్గరవుతుందన్న సంతోషం కమల దళం నాయకుల్లో కనిపించింది. అదే జోరులో ఇప్పుడు వెనుకబడిన వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా అప్నాదళ్‌ (ఎస్‌), నిషాద్‌ పార్టీలను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ పార్టీల నేతలు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. నిజానికి ఈ రెండు పార్టీలు భాజపాతో కలిసి పోటీ చేసినవే. గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నాయి. 

మళ్లీ మంత్రివర్గంలోకి అనుప్రియ!

యూపీలో యాదవుల తర్వాత అత్యంత బలమైన ఓటు బ్యాంకు కుర్మి సామాజిక వర్గానికి ఉంది. ఆ వర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న అప్నాదళ్‌ నేత అనుప్రియా పటేల్‌.. గతం లో మోదీ మంత్రివర్గంలో పనిచేశారు. రెండో సారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కారణాలతో ఆమెకు చోటు దక్కలేదు. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న  తరుణంలో మళ్లీ అనుప్రియా పటేల్‌కు మంత్రివర్గంలో చోటిస్తారన్న ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో జరిగిన సమావేశంలో ఆమె తనకు కేంద్రంలో మంత్రి పదవితో పాటు.. రాష్ట్రంలో తన భర్త ఆశిష్‌ పటేల్‌కు అమాత్య పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు భాజపా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

నిషాద్‌.. అదే బాటలో..

మత్స్యకార వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నిషాద్‌ పార్టీ కూడా మంత్రివర్గంలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తోంది. మత్స్యకారులను వెనుకబడిన కులాల జాబితాలో కాకుండా షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో చేర్చాలని ఆ పార్టీ చాలా కాలంగా డిమాండ్‌ చేస్తోంది. అది నెరవేరుతుందో లేదో తెలియదు గానీ ఆ పార్టీ నాయకుడు సంజయ్‌ నిషాద్‌ మాత్రం వచ్చే ఎన్నికల్లో భాజపాతో పొత్తుకు సిద్ధం అంటున్నారు ‘‘ఆర్టికల్‌ 370.. ఇతర జాతీయ సమస్యలపై మోదీ ఇన్నాళ్లూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు మా సమస్యలపై 
దృష్టిపెడతారు’’ అని సంజయ్‌ తన సామాజిక 

వర్గానికి హామీ ఇస్తున్నారు. 
హోంమంత్రి అమిత్‌షాతో ఇటీవల జరిగిన సమావేశంలో గతంలో తమ పార్టీకి ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. భాజపా కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిషాద్, అప్నాదళ్‌తో పాటు రాజభర్‌ సామాజిక వర్గాన్ని షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్న సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీని కూడా తనవైపు తిప్పుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. అయితే ఆ పార్టీ నాయకుడు ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ మాత్రం అలాంటి అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నారు. భాజపా మునిగిపోయే నావ అంటున్నారు. కాషాయ పార్టీ మాత్రం ఆశలు వదులుకోవడం లేదు.

అంతటా చిన్న పార్టీలే ముద్దు

చిన్న పార్టీలకు భాజపా గౌరవం ఇస్తుందని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. యూపీలోనే కాదు.. బిహార్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో కూడా చిన్నపార్టీలతో తాము పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఆ పార్టీ గుర్తు చేస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో యోగి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేతలతో పాటు, సొంత పార్టీ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన యూపీపై పట్టును ఎట్టిపరిస్థితుల్లో కోల్పోకూడదని భాజపా కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో చిన్న పార్టీలతో సయోధ్య కీలకమని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. త్వరలో యోగి ఆదిత్య నాథ్‌ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న ఊహాగానాలు ఇప్పటికే బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ఓటమి నేపథ్యంలో యూపీలో ఏ చిన్న తప్పిదం కూడా చేయకూడదని భాజపా అధినాయకత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది యూపీతో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్‌ ఎన్నికలు జరగనున్నాయి. మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఈ రాష్ట్రాల్లో పాగా వేయడం భాజపాకు కీలకం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని