EB Virus: ఈబీ వైరస్‌ వ్యాప్తి తీరు ఇలా...  
close

తాజా వార్తలు

Published : 15/06/2021 13:09 IST

EB Virus: ఈబీ వైరస్‌ వ్యాప్తి తీరు ఇలా...  

 వెలుగులోకి తెచ్చిన భారత శాస్త్రవేత్తలు 

దిల్లీ: క్యాన్సర్‌ను కలిగించే ఎప్‌స్టైన్‌ బార్‌ వైరస్‌ (ఈబీవీ) గమనానికి సంబంధించి భారత శాస్త్రవేత్తలు కీలక అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. కేంద్ర నాడీ వ్యవస్థలోని న్యూరాన్లకు రక్షణ కల్పించే గ్లియాల్‌ కణాలపై ఇది ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. అలాగే మెదడు కణాల్లోని నిర్దిష్ట పరమాణువులనూ లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తేల్చారు. నాడీ క్షీణత వ్యాధుల్లో ఈ వైరస్‌ పాత్ర గురించి అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని వివరించారు. అల్జీమర్స్, పార్కిన్‌సన్స్, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ వంటి నాడీ సంబంధ రుగ్మతలతో బాధపడేవారి మెదడు కణజాలంలో ఈ వైరస్‌ వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 

ఈబీవీ వల్ల తల, మెడ క్యాన్సర్‌ (నాసోఫ్యారింజియల్‌ కార్సినోమా), బి-సెల్‌ క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బుర్కెట్స్‌ లింఫోమా వంటి అనేక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉంది. వయోజనుల్లో 95 శాతం మందిలో ఈ వైరస్‌ ఉండొచ్చు. అయితే దీని ఇన్‌ఫెక్షన్‌ చాలా వరకూ లక్షణాలు లేకుండానే ఉంటుంది. ఈ వ్యాధికి కారణమయ్యే అంశాలు ఇప్పటివరకూ పెద్దగా వెలుగులోకి రాలేదు. తాజాగా ఇండోర్‌లోని ఐఐటీ, దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాథాలజీకి చెందిన శాస్త్రవేత్తలు రామన్‌ స్పెక్ట్రోస్కొపీ సిస్టమ్‌ను ఉపయోగించుకొని ఈబీవీ వైరస్‌ వ్యాప్తి తీరుతెన్నులను గుర్తించారు. మెదడులోని గ్లియాల్‌ కణాలకు ఇది ఇన్‌ఫెక్షన్‌ కలిగించగలదని తేల్చారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి తీరులోనూ వైరుధ్యాలను గుర్తించారు. మెదడు కణాలకు ఇది ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సమయంలో ఫాస్ఫో-ఇనోసిటోల్స్‌ వంటి పరమాణువులు మార్పులకు లోనవుతున్నట్లు తేల్చారు. శరీరంలోకి ఎలాంటి సాధనాలను చొప్పించకుండానే మెదడులోని వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ తీరు తెన్నులను పరిశీలించడానికి రామన్‌ స్కాటరింగ్‌ను ఉపయోగించేందుకు ఈ పరిశోధన బాటలుపరిచిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల రోగి నుంచి బయాప్సీలను సేకరించాల్సిన అవసరం తప్పుతుందన్నారు. అలాగే వ్యాధిని త్వరగా గుర్తించొచ్చని వివరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని