92 ఏళ్ల వృద్ధుడికి బేడీలు వేసి వైద్యం చేస్తారా?
close

తాజా వార్తలు

Published : 18/06/2021 23:21 IST

92 ఏళ్ల వృద్ధుడికి బేడీలు వేసి వైద్యం చేస్తారా?

యూపీ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

దిల్లీ: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఈటా జిల్లా ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న 92 ఏళ్ల ఖైదీకి బేడీలు వేయడంపై జాతీయ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఓ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న బాబురామ్‌ బలరాం సింగ్‌ అనే వృద్ధుడు ఆస్పత్రిలో కాలికి బేడీలతో, ఆక్సిజన్‌ మాస్కు ధరించి ఉన్న ఫోటో గత నెలలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దీంతో ఘటనకు కారణమైన జైలు అధికారిని సస్పెండ్‌ చేశారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ 92 ఏళ్ల వృద్ధుడిని జైల్లో ఉంచడాన్ని చూస్తుంటే రాష్ట్రంలో శిక్ష సమీక్షా బోర్డు సరిగా పని చేయడం లేదని అర్థమవుతోందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘92 ఏళ్ల ఖైదీ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలోనూ గొలుసులతో బంధించడాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది’’ అని పేర్కొంది. రాష్ట్ర శిక్ష సమీక్షా బోర్డు చివరిసారిగా ఎప్పుడు సమావేశమైంది? ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి? 2019, 2020 సంవత్సరాల్లో ఎన్ని శిక్షలు అమలు చేశారు? తదితర వివరాలతో ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఖైదీల మానవ హక్కులను పరిరక్షించేందుకు శిక్ష సమీక్ష బోర్డు పనితీరు కచ్చితంగా మెరుగు పడాల్సిందేనని తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని