Vaccine: అత్యవసరంగా టీకాలు మళ్లీ పంపండి 
close

తాజా వార్తలు

Updated : 20/06/2021 10:56 IST

Vaccine: అత్యవసరంగా టీకాలు మళ్లీ పంపండి 

ఉత్పత్తి పెంచకపోతే చాలా దేశాలకు ఇబ్బందే 
భారత్‌ సహకారాన్ని కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఐరాస: రెండో డోసు టీకాలను ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న 30కిపైగా దేశాలను ఆదుకునేందుకు అత్యవసరంగా కరోనా వ్యాక్సిన్ల సరఫరాను మళ్లీ ప్రారంభించాలని భారత్‌కు, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ)కు ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్‌వో) విజ్ఞప్తి చేసింది. టీకాల ఎగుమతిని భారత్‌ నిలిపివేయడం వల్ల ఆ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని తెలిపింది. భారత్‌ పొరుగున ఉన్న నేపాల్, శ్రీలంక సహా మరెన్నో దేశాలు.. కరోనాతో తీవ్రంగా పోరాడుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌కు సలహాదారుగా ఉన్న బ్రూస్‌ ఐల్వార్డ్‌ తెలిపారు. తాము ఈ దేశాలకు వ్యాక్సిన్‌ డోసులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జూన్‌ నెల ప్రారంభంలో తాము 8 కోట్ల టీకా డోసులను వివిధ దేశాలకు సరఫరా చేశామని, అన్ని దేశాలకు సమానంగా పంపిణీని చేపట్టేందుకు తమకు మరో 20 కోట్ల డోసులు కావాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా రెండో ఉద్ధృతి ప్రభావంతో భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి తమకు టీకా సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. 30-40 దేశాలు ఇప్పుడు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లకు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. టీకాల మధ్య ఉండాల్సిన వ్యవధి కంటే చాలా ఎక్కువ విరామం వస్తోందని, అందుకే ఎగుమతులు ప్రారంభించాల్సిందిగా భారత్‌ను కోరుతున్నామని చెప్పారు.

న్యూయార్క్‌లో 6.7% ‘డెల్టా’ కేసులు

న్యూయార్క్‌: భారత్‌లో తొలిసారి బయటపడిన కరోనా డెల్టా రకం (బీ.1.617.2) కేసులు అమెరికాలోనూ బయట పడుతున్నాయి. ఈమేరకు జూన్‌ 5తో ముగిసిన వారానికి న్యూయార్క్‌లో 105 కొవిడ్‌-19 కేసులు బయటపడగా అందులో 6.7 శాతం డెల్టా రకం ఉన్నట్లు నగర ఆరోగ్య విభాగం తెలిపింది. అయితే ఆల్ఫా రకం (బీ.1.1.7) కేసులు అత్యధికంగా 36.2% ఉన్నట్లు వెల్లడించింది. అలాగే గామా (పీ.1), అయోటా (బీ.1.526) రకాల కేసులు వరుసగా 17.1%, 4.8% శాతం నమోదైనట్లు తెలిపింది. గత 4 వారాల్లో డెల్టా రకం కేసులు 5.6% కనిపించినట్లు పేర్కొంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని