Crypto currency: కలయా.. నిజమా..
close

తాజా వార్తలు

Updated : 21/06/2021 12:17 IST

Crypto currency: కలయా.. నిజమా..

ఆశలపల్లకిలో మాంచెస్టర్‌ విద్యార్థి

తబలీసి: ప్రతిరోజూ పొద్దున లేస్తూనే ఫోను చూసుకోవడం.. క్రిప్టోకరెన్సీ లెక్కలు వేసుకోవడం అలవాటున్న క్రిస్‌ విలియమ్స్‌ ఇటీవల ఓ రోజు ఫోను చూసి షాక్‌కు గురయ్యాడు. నేనేమైనా కల కంటున్నానా అని కళ్లు నులిమి చూసుకున్నాడు. లేదు.. వాస్తవమే. క్రిప్టోకరెన్సీలో 20 డాలర్లు పెట్టుబడి పెట్టిన ఇతను రాత్రికి రాత్రే ట్రిలియనీర్‌ అయిపోయాడు. జార్జియాలోని మాంచెస్టర్‌లో చదువుకుంటున్న క్రిస్‌ విలియమ్స్‌ ఎనిమిది నెలల నుంచి క్రిప్టోకరెన్సీపై అధ్యయనం చేస్తున్నాడు. గత వారం రాకెట్‌ బన్నీ అనే క్రిప్టోకరెన్సీలో 20 డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. ఈ విలువ ఆ మరుసటిరోజుకు 1.4 ట్రిలియన్లకు రివ్వున ఎగబాకింది. మన కరెన్సీలోకి మార్చుకుంటే దీని విలువ సరిగ్గా రూ.10,38,01,74,00,00,000. లెక్క పెట్టకండి... మేమే చెబుతాం. ఈ మొత్తం రూ.కోటి కోట్లకు పైమాటే. కాసేపటికి తేరుకున్న విలియమ్స్‌ ఆ మొత్తాన్ని వేరే వాలెట్‌లోకి మార్చుకునేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం తాను ఇన్వెస్ట్‌ చేసిన కాయిన్‌బేస్‌ వాలెట్‌ను సంప్రదించాడు. తాము ఈ సమస్య పరిష్కారానికి రాకెట్‌ బన్నీని సంప్రదిస్తున్నామని జవాబు వచ్చింది.

ఆ తర్వాత నాలుగైదు రోజులు గడిచినా ఉలుకూ పలుకు లేదు. సలహా కోసం ఈ విషయాన్ని విలియమ్స్‌ ట్విటర్‌లో నెటిజన్లతో షేర్‌ చేసుకున్నాడు. క్రిప్టోకరెన్సీలపై ఎప్పుడూ తన శైలిలో ట్వీట్లు చేసే స్పేస్‌ఎక్స్‌ అధినేత  ఎలాన్‌ మస్క్‌నూ ట్యాగ్‌ చేసి, సలహా ఇవ్వాలని కోరాడు. తాను పెట్టుబడి పెట్టిన క్రిప్టోకరెన్సీ స్కామ్‌ కాకపోవచ్చని విలియమ్స్‌ భావిస్తున్నాడు. అన్ని డబ్బులను జీవితకాలం ఖర్చుచేసినా మిగిలిపోతాయని.. ఆ డబ్బులు వస్తే తన కుటుంబసభ్యులను బాగా చూసుకొని, ఉచిత క్లినిక్‌లు తెరిపిస్తానని చెబుతున్నాడు. ప్రస్తుతం లావాదేవీలు జరుపుదామన్నా వీలులేకుండా విలియమ్స్‌ ఖాతాను కాయిన్‌బేస్‌ నిలిపివేసింది. దీంతో, ఏదో సాంకేతికలోపంవల్లే తన వాలెట్‌లోని కరెన్సీ విలువ పెరిగి ఉంటుందని పాపం.. సర్దిచెప్పుకొంటున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని