J&K: ఉగ్రవాదం.. కొత్త కోణం..! 

తాజా వార్తలు

Published : 05/07/2021 11:02 IST

J&K: ఉగ్రవాదం.. కొత్త కోణం..! 

 జన బాహుళ్యంలోనే ఉంటూ అదును చూసి దాడులు 

కశ్మీర్‌లో ముష్కర ముఠాల కుట్ర  

 నిఘా పెంచిన పోలీసులు 

శ్రీనగర్‌: కశ్మీర్‌లో భద్రతా దళాలకు కొత్త సవాల్‌ ఎదురవుతోంది. లోయలో ఇప్పుడు ‘హైబ్రిడ్‌ ఉగ్రవాదం’ పుట్టుకొచ్చింది. సమాజంలో సాధారణ వ్యక్తుల్లానే జీవనం సాగిస్తూ.. అదును చూసి దాడులకు పాల్పడే ముష్కరులు కొత్తగా తెరపైకి వచ్చారు. ఇలాంటి వారి జాడను పట్టుకోవడం పోలీసులకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో నిఘా మరింత ముమ్మరం చేశారు.

ఈ తరహా ముష్కరులు.. భద్రతా దళాల వద్ద ఉండే ఉగ్రవాదుల జాబితాలో ఉండరు. సాధారణ వ్యక్తుల్లానే జీవనం సాగిస్తుంటారు. అయితే వారిలో అణువణువునా అతివాదం నిండి ఉంటుంది. ఉగ్రవాద ముఠా నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తుంటారు. వారిచ్చిన ఆదేశాల మేరకు అదనుచూసి దాడులకు దిగుతుంటారు. తిరిగి జనజీవన స్రవంతిలో కొనసాగుతారు. బాసులు కొత్త ‘పని’ అప్పగించేవరకూ ఎదురుచూస్తుంటారు. ఈ ‘పార్ట్‌ టైమ్‌’ ఉగ్రవాదం భద్రతా దళాలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. గత కొద్ది వారాలుగా శ్రీనగర్‌ సహా కశ్మీర్‌ లోయలో తేలికపాటి లక్ష్యాలపై దాడులు జరిగాయి. వీటిలో అనేకం.. పిస్తోళ్లు చేతబట్టిన యువకులు చేశారు. వారెవరూ ఉగ్రవాద జాబితాలో లేరు.

పాక్‌ కుట్రే

పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ కనుసన్నల్లోనే ఈ కొత్త పోకడ తెరపైకి వచ్చిందని అధికారులు తెలిపారు. ‘‘పూర్తి నిస్సహాయ స్థితిలో ఉన్న ఐఎస్‌ఐ, ఉగ్రవాదులు కొత్త కుట్రలు పన్నుతున్నారు. పిస్తోళ్లతో సులువైన లక్ష్యాలపై దాడి చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎదురుదాడి చేయలేని నిరాయుధులనే లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. ఎక్కువగా వ్యాపారులు, మైనార్టీలు, సామాజిక కార్యకర్తలు, ఎలాంటి రక్షణ లేని రాజకీయ నేతలు, విధుల్లో లేని పోలీసులపై గురి పెడుతున్నారు. భయాందోళనలు వ్యాప్తి చేసి.. వ్యాపారాలను,   ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి చేపట్టే సామాజిక కార్యక్రమాలను అడ్డుకోవడమే వీరి లక్ష్యం. తద్వారా.. వేర్పాటువాదానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి గొంతుకలను నొక్కేయాలని భావిస్తున్నారు’’ అని చెప్పారు. ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్న ఘటనలు కావని, వాటి వెనుక పక్కా ప్రణాళిక ఉందన్నారు. లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టి, దాడికి అనువైన సమయాన్ని ఎంచుకొని మరీ విరుచుకుపడుతున్నారని పేర్కొన్నారు. కిరాయి హంతకుల్లా వీరి కార్యకలాపాలు ఉంటున్నాయని తెలిపారు. గత ఏడాది సెప్టెంబరులో పోలీసులు శ్రీనగర్‌ను ఉగ్రవాద రహిత నగరంగా ప్రకటించారు. ఆ తర్వాత కూడా పౌరులు, పోలీసులపై దాడులు కొనసాగాయి. ఇవి హైబ్రిడ్‌ ఉగ్రవాదుల పనేనని అధికారులు చెబుతున్నారు. గత కొన్నివారాల్లో ఇలాంటి ఘటనలు పెరిగాయి. గత నెల 23న శ్రీనగర్‌లో ఉమర్‌ అహ్మద్‌ (25) అనే దుకాణదారుడిని ముష్కరులు కాల్చి చంపారు. దానికి ముందు రోజున నగర శివార్లలోని కనిపొర నౌగామ్‌లో సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ పర్వేజ్‌ అహ్మద్‌ దార్‌ను చంపేశారు. వెనుక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పిస్తోళ్లతో కాల్పులు జరిపి పరారు కావడం సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. జూన్‌ 17న శ్రీనగర్‌లోని పాతబస్తీలో.. డ్యూటీలో లేని  ఒక పోలీసును అత్యంత సమీపం నుంచి కాల్చి చంపారు. నగరంలో ఉగ్రవాదులకు సంబంధించిన నిద్రాణ విభాగాలు, హైబ్రిడ్‌ ముష్కరులు మాటువేసి ఉన్నట్లు స్పష్టమవుతోందని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. పూర్తిస్థాయి ఉగ్రవాదుల కదలికలపై నిఘా వేయవచ్చని, తాత్కాలిక ముష్కరుల జాడను పసిగట్టడం ఒకింత కష్టమేనని తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని