Hygiene: అతి శుభ్రత అనర్థదాయకమేమీ కాదు

తాజా వార్తలు

Updated : 09/07/2021 12:40 IST

Hygiene: అతి శుభ్రత అనర్థదాయకమేమీ కాదు

పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపబోదు.. శాస్త్రవేత్తల వెల్లడి  

లండన్‌: ఆధునిక సమాజం అతి శుభ్రతను పాటిస్తోందన్న వాదన నిజం కాదని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చిన్నతనంలోనే కొన్ని రకాల సూక్ష్మజీవుల ప్రభావం పడితే.. రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చెందుతుందని, ఫలితంగా అలర్జిక్‌ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వైద్యశాస్త్రంలో ఒక సూత్రం ఉంది. 21వ శతాబ్దంలో సమాజం అతి శుభ్రంగా ఉంటోందని, దీనివల్ల చిన్నారులు కొన్ని రకాల సూక్ష్మజీవులకు దూరంగా ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. అందువల్ల అలర్జీలను ఎదుర్కొనే సామర్థ్యం వారికి తక్కువగా ఉంటోందని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ కాలేజీ లండన్, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తల నిర్వహించిన అధ్యయనం ఈ వాదనను కొట్టిపారేసింది. రోగ నిరోధక, జీవక్రియ వ్యవస్థలు తగిన విధంగా సిద్ధం కావడానికి కొన్ని రకాల సూక్ష్మజీవులు అవసరమేనని వారు అంగీకరించారు. ‘‘మన పేగులు, చర్మం, శ్వాసనాళాల్లో ఉండే సూక్ష్మజీవులు మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చాలావరకూ అవి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, సహజసిద్ధ వాతావరణం నుంచి వస్తాయి. అయితే గత 20 ఏళ్లలో పరిశుభ్రత విధానాలతో వాటికి దూరమవుతున్నట్లు ఓ వాదన ఉంది. అది పూర్తిగా నిజం కాదు’’ అని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన గ్రాహమ్‌ రూక్‌ పేర్కొన్నారు. ఈ దిశగా నాలుగు అంశాలను ప్రస్తావించారు.  
*ఆధునిక ఇళ్లల్లో ఉండే సూక్షజీవులు చాలావరకూ మన రోగ నిరోధకశక్తికి అవసరం లేనివే. 
*మనం తీసుకునే టీకాలు.. ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షించడంతోపాటు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అందువల్ల రోగనిరోధక వ్యవస్థ సిద్ధం కావడం కోసం వ్యాధి కారక సూక్ష్మజీవుల బారినపడి, ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 
* సహజసిద్ధ హరిత వాతావరణంలోని సూక్ష్మజీవులు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇళ్లలోని శుభ్రత, ఆరోగ్యం వంటివి అలాంటి సహజసిద్ధ వాతావరణాన్ని మన నుంచి దూరం చేయలేవు.  
* అతి శుభ్రత, ఆరోగ్య సమస్యలకు మధ్య సంబంధాన్ని నిపుణులు పలు సందర్భాల్లో గుర్తించిన మాట వాస్తవమే. అయితే అవి.. చాలావరకూ సూక్ష్మజీవుల లేమి వల్ల ఉత్పన్నమైనవి కావు. శుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్లే ఇలా జరుగుతోంది. 
అందువల్ల ఇళ్ల శుభ్రత, వ్యక్తిగత శుభ్రత మంచిదేనని గ్రాహమ్‌ రూక్‌ తెలిపారు. అయితే పరిశుభ్రతకు సంబంధించిన రసాయనాలను చిన్నారులు నేరుగా గురికాకుండా చూడాలని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని