Corona: ఆంక్షల బాటలో ఆసియా- పసిఫిక్‌

తాజా వార్తలు

Updated : 10/07/2021 17:21 IST

Corona: ఆంక్షల బాటలో ఆసియా- పసిఫిక్‌

పలు దేశాల్లో మళ్లీ కొవిడ్‌ ఉద్ధృతి

బ్యాంకాక్‌: ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని పలు దేశాల్లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ వంటి కట్టుదిట్టమైన నిబంధనలకు ఉపక్రమించాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో తిరిగి కరోనా ఉద్ధృతి వచ్చినప్పుడు కేసులు పెరగడం, మరణాల సంఖ్య అధికం కావడం వంటివి చోటుచేసుకున్నాయి. అయితే చాలామేర ఆసియా దేశాలు ప్రయాణాలపై నిబంధనలతో పాటు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో అక్కడ కరోనా మరోసారి విజృంభించలేదు. తాజాగా అలాంటి దేశాల్లో వైరస్‌ ఉద్ధృతి కనిపిస్తోంది. చాలామేర డెల్టా రకం కేసులు పెరుగుతున్నాయి. థాయిలాండ్‌లో గురు, శుక్రవారాల్లో దాదాపు 150 మరణాలు సంభవించాయి. కరోనా కట్టడిలో ముందంజలో ఉన్న దక్షిణ కొరియాలోనూ గత రెండు రోజుల్లో 2,500కి పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. తొలిసారిగా ఇండొనేసియాలో ఆసుపత్రులు కొవిడ్‌ బాధితులతో కిక్కిరిసిపోగా, ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. థాయిలాండ్‌లోని బ్యాంకాక్, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం కఠిన ఆంక్షలు విధించారు. ప్రజా రవాణాను పరిమితం చేయడంతో పాటు మార్కెట్లు, స్పాలు వంటివాటిని తెరవడంపై ఆంక్షలు విధించారు. దక్షిణ కొరియాలో భౌతిక దూరం వంటి నిబంధనలను సడలించడం వల్లే కేసులు పెరుగుతున్నట్లు ఆ దేశంలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సియోల్‌ తదితర ప్రాంతాల్లో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ తరహా నిబంధనలు అమలు చేయడానికి నిర్ణయించారు. ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధించారు. ఇండొనేసియాలో గత రెండు వారాలుగా కేసులు రెట్టింపయ్యాయి. ఈనెల 3 నుంచి అక్కడ లాక్‌డౌన్‌ విధించినప్పటికీ, ఇప్పటికే ఆలస్యమైందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ మరో వేవ్‌ వచ్చిందని హెచ్చరించారు. జావా, బాలి, సుమత్రా దీవుల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. జూన్‌ 1 నుంచి ఇక్కడ 5,903 మరణాలు సంభవించాయి. ఇది అక్కడ రెండో లాక్‌డౌన్‌ కాగా రోజువారీ కేసులు 4 వేల దిగువకు చేరేంతవరకు ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. 

‘లాటిన్‌’ను వణికిస్తున్న లాంబ్డా ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లోనూ..

ఒట్టావా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (సార్స్‌-కోవ్‌-2) అనేక రకాలు (వేరియంట్లు)గా రూపాంతరం చెందుతూ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే ‘డెల్టా’ రకం చాలా దేశాల్లో వ్యాప్తి చెందగా.. పలుచోట్ల ‘లాంబ్డా’ వేరియంట్‌ హడలెత్తిస్తోంది. ఇంతవరకు దీన్ని పపంచ ఆరోగ్య సంస్థ ‘దృష్టి సారించాల్సిన వైరస్‌ రకం (వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌)’గానే గుర్తించినప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వాటిలో లాటిన్‌ అమెరికా దేశాలే ఎక్కువగా ఉన్నాయి. లాంబ్డా రకం ‘డెల్టా’ కంటే ప్రాణాంతకమని మలేసియా ఆరోగ్య శాఖ ఇటీవల ప్రకటించింది. గత 4 వారాల్లో దాదాపు 30 దేశాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. లాంబ్డా రకాన్ని తొలుత గుర్తించిన పెరూలో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు కూడా పేర్కొంది. బ్రిటన్‌లోనూ లాంబ్డా రకం జాడ కనిపించింది. పెరూ, చిలీ దేశాల్లో ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో పరిశీలించిన కరోనా వైరస్‌ నమూనాల్లో చాలామేర ఈ రకం బయటపడింది. లాంబ్డా వేరియంట్‌ తీవ్రత ఏమేరకు ఉందో తెలుసుకునే విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ (పీహెచ్‌ఈ) దృష్టి సారించాయి. డెల్టా కంటే లాంబ్డా మరింత ప్రమాదకరం కావొచ్చని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతుండగా.. ఇది డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందనేందుకు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని బ్రిటన్‌ ఆరోగ్య నిపుణులు తెలిపారు. దీని తీవ్రత, వ్యాక్సిన్లు ఈ రకంపై ఎంత సమర్థంగా పనిచేస్తాయి? అనే విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.

కెనడాలో 11 కేసులు

కెనడాలో ఇప్పటివరకు 11 లాంబ్డా రకం కేసులను గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. అయితే మార్చి, ఏప్రిల్‌ నాటికే ఈ ఈ రకం కేసులు 27 నమోదైనట్లు కెనడాకు చెందిన జాతీయ ప్రజారోగ్య సంస్థ తెలిపింది. దీని ప్రభావం ఏమేరకు ఉంటుందో ఇంకా తెలుసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని