Priyanka: ఎన్నికల్లో పోటీ చేయడమా.. చూద్దాం

తాజా వార్తలు

Published : 18/07/2021 15:25 IST

Priyanka: ఎన్నికల్లో పోటీ చేయడమా.. చూద్దాం

యూపీలో సమాజ్‌వాదీ కార్యకర్తల్ని కలిసిన ప్రియాంక 
సోదరీమణులుగా భావించి వచ్చానని స్పష్టీకరణ 

లఖ్‌నవూ: ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసే విషయం ‘చూద్దాం’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చిన ఆమె శనివారం ఈ విషయమై లఖింపుర్‌ ఖేరిలో విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. యూపీలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీకి దిగుతారా, పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా అని ఆమెను ప్రశ్నించగా ‘అన్నీ నేను ఇప్పుడే చెప్పాలా?’ అని బదులిచ్చారు. ప్రజల సమస్యలపై తమ పార్టీ తరఫున గత 18 నెలలుగా జరుగుతున్న పోరాటం కొనసాగుతుందని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని చెప్పారు. మిగిలిన పార్టీలేవీ ఆందోళనలు చేయడం లేదన్నారు. ఇటీవల యూపీలో జరిగిన బ్లాకు పంచాయతీ అధ్యక్షుల ఎన్నికల్లో భాజపా కార్యకర్తల చేతిలో దౌర్జన్యానికి గురైన ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలను ఆమె కలిసి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వేరే పార్టీకి చెందినవారైనా వారిని సోదరీమణులుగా భావించి పరామర్శకు వచ్చినట్లు చెప్పారు. 

హక్కును కాలరాశారు 

‘ఎన్నికల్లో పోరాడేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది. లఖింపుర్‌లో మాత్రం సమాజ్‌వాదీ కార్యకర్త హక్కును కాలరాశారు. నామినేషన్‌ వేయడానికి వెళ్తున్న ఆమెను చీర పట్టుకుని లాగారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారిని సస్పెండ్‌ చేశారు. దోషులను వదిలేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇలాంటి పాలన మనకు కావాలా? ఇక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’ అని ప్రియాంక డిమాండ్‌ చేశారు. మహిళలు బ్లాకు పంచాయతీ అధ్యక్షురాళ్లుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానిగా ఎన్నికవుతారని, తమపై దాడులు చేస్తున్నవారి సంగతి తేలుస్తారని ఆమె ట్వీట్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని