Covid Vaccine: భారత్‌లో ఏడాది చివరికి 18 + అందరికీ టీకా

తాజా వార్తలు

Updated : 24/07/2021 10:18 IST

Covid Vaccine: భారత్‌లో ఏడాది చివరికి 18 + అందరికీ టీకా

ఈనాడు, దిల్లీ: దేశంలో కొవిడ్‌ టీకాలకు కొరత ఉందన్న విమర్శలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ ఏడాది డిసెంబరుకు 18ఏళ్ల వయసు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ అందించగలమని తెలిపింది. జులై 20నాటికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొత్తం 34.83 కోట్ల టీకా డోసులను ఉచితంగా సరఫరా చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు. ఆగస్టు-డిసెంబర్‌ మధ్య కాలంలో మరో 135 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు. దేశీయ టీకా తయారీదారులతో వ్యాక్సిన్‌ సేకరణ కోసం ఒప్పందాలు చేసుకోవడంలో ఎలాంటి జాప్యం జరగలేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ల సేకరణ, వాటి సరఫరా, నిర్వహణ ఖర్చుల కోసం ఇప్పటి వరకు కేంద్రం రూ.9,725.15 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.

శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు మాలారాయ్, ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన వేర్వేరు లిఖిత పూర్వక ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. మే 1 నుంచి జూన్‌ 21వరకు అమలు చేసిన సరళీకృత టీకా సేకరణ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు 4.57 కోట్ల డోసులు కొనుగోలు చేశాయని వెల్లడించారు. ఈ విధానం అమలైన కాలంలో వ్యాక్సినేషన్‌ వేగం తగ్గినట్లు అంగీకరించారు. దేశవ్యాప్తంగా 2,49,648 డోసులు వృథా అయ్యాయని, వైద్య సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించి ఒక్కో వయల్‌ నుంచి అదనంగా డోసులు సేకరించడం వల్ల 41,11,516 డోసులు అదనంగా అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇలా లక్షల్లో అదనపు డోసులు సేకరించినట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని