Covid: ఇన్‌ఫెక్షన్‌ తగ్గిపోయినా.. కొవిడ్‌తో మానసిక గ్రహణం

తాజా వార్తలు

Updated : 31/07/2021 10:31 IST

Covid: ఇన్‌ఫెక్షన్‌ తగ్గిపోయినా.. కొవిడ్‌తో మానసిక గ్రహణం

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ తగ్గిపోయినా.. బాధితులపై మనసుపై అది పెనుగాయమే చేస్తోందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల కొందరిలో విషయ గ్రహణశక్తికి సంబంధించి లోపాలు కనిపిస్తున్నాయని తేల్చారు. అల్జీమర్స్‌ వ్యాధి లక్షణాలు ఉద్ధృతమవుతున్నాయని గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గనిర్దేశకత్వంలో దాదాపు 40 దేశాల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కేంద్ర నాడీ వ్యవస్థపై కొవిడ్‌ చూపే దీర్ఘకాల ప్రభావాలపై మదింపు వేశారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకినవారిలో సాధారణంగా శ్వాస, జీర్ణాశయ రుగ్మతలు కనిపిస్తుంటాయి. అనేక మందిలో స్వల్ప, దీర్ఘకాల నాడీ, మానసిక వ్యాధి లక్షణాలూ తలెత్తుతున్నాయి. వీటిలో వాసన, రుచి సామర్థ్యం తగ్గడం, విషయగ్రహణ శక్తి, ఏకాగ్రతలో లోపాలు వంటివి ఉంటున్నాయి. వీటిని ‘బ్రెయిన్‌ ఫాగ్‌’ అని పిలుస్తారు. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న వృద్ధులు తరచూ విషయ గ్రహణ శక్తికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తేల్చారు. ఈ బాధితుల్లోని నాడీ రుగ్మతలు.. మెదడులో గాయం, న్యూరో ఇన్‌ఫ్లమేషన్, అల్జీమర్స్‌కు సంబంధించిన సంకేతాలతో సరిపోలుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటివారి రక్తంలో ఆక్సిజన్‌ తక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీరు కొద్దిపాటి శ్రమకే అలిసిపోతున్నారని, వీరి శారీరక పటుత్వం అంతంతమాత్రంగా ఉంటోందని పరిశోధనలో పాలుపంచుకున్న హీథర్‌ ఎం సిండర్‌ పేర్కొన్నారు. అర్జెంటీనాలో కొవిడ్‌ నుంచి కోలుకున్న 300 మంది వృద్ధులపై పరిశోధన చేసి, శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని