Assam-Mizoram border dispute: అస్సాం-మిజోరం సరిహద్దు.. నివురుగప్పిన నిప్పు

తాజా వార్తలు

Published : 01/08/2021 10:32 IST

Assam-Mizoram border dispute: అస్సాం-మిజోరం సరిహద్దు.. నివురుగప్పిన నిప్పు

పొరుగు రాష్ట్రం కేసుపై ఏ విచారణకైనా సిద్ధం: హిమంత
నాగాలాండ్‌తో కుదిరిన సరిహద్దు ఒప్పందంపై హర్షం

ఆయిజోల్, దిమాపుర్‌ - ఈనాడు, గువాహటి: అస్సాం-మిజోరం సరిహద్దులో ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతం శనివారం నివురుగప్పిన నిప్పులా కనిపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఇతర రాష్ట్రాలతో సరిహద్దు విషయమై ఉన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా అస్సాం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు అస్సాం- నాగాలాండ్‌ సరిహద్దులో నెలకొన్న వివాదం పరిష్కారానికి రెండు ప్రభుత్వాలు శనివారం ఒక ఒప్పందం చేసుకున్నాయి. వివాదాస్పద ప్రాంతాల్లోని ఇరు రాష్ట్రాల సాయుధ పోలీసులను తక్షణం ఉపసంహరించుకుని, ఆయా శిబిరాలకు తరలించాలని నిర్ణయించారు. ఒప్పందం ప్రకారం దెస్సొయ్‌ లోయ అభయారణ్యంలోని (నాగాలాండ్‌లో ట్సురాంగ్‌కాంగ్‌ లోయగా పిలుస్తారు) వివాదాస్పద స్థలాల్లోని సాయుధ పోలీసులను 24 గంటల్లో పూర్తిగా ఉపసంహరిస్తారు. అనంతరం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్‌ల ద్వారా, ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా యథాతథస్థితిని కొనసాగించేందుకు కృషి చేస్తాయి. ఈ ఒప్పందంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హర్షం వ్యక్తం చేశారు. నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నైఫియు రియోకు కృతజ్ఞతలు తెలిపారు.

తటస్థ సంస్థకు అప్పగించాలి

మిజోరంలో తనపై కేసు నమోదైనట్లు వచ్చిన వార్తలపై బిశ్వశర్మ స్పందించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని శనివారం ప్రకటించారు. అదే సమయంలో రాజ్యాంగ పరంగా అస్సాం భూభాగంలో జరిగిన ఘర్షణపై విచారణను తటస్థ సంస్థకు ఎందుకు అప్పజెప్పడం లేదని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ఈ విషయాన్ని మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగాకు తెలిపానన్నారు. ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు మృతి చెందిన ఘటనకు సంబంధించి.. మిజోరంలోని కొలాసిబ్‌ అధికారులు ఆరుగురిపై అస్సాంలోని కచార్‌ జిల్లా అధికారులు కేసు నమోదు చేసి, సమన్లు జారీ చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి.

రాష్ట్రంలోకి వాహనాలు రావడం లేదు: మిజోరం

జులై 26న సరిహద్దులో ఘర్షణలు చోటుచేసుకున్న రోజు నుంచి అస్సాం నుంచి ఒక్క ట్రక్కు కూడా రాష్ట్రంలోకి రాలేదని మిజోరం అధికారులు పునరుద్ఘాటించారు. మిజోరం జీవనాడి అయిన 306వ నంబరు జాతీయ రహదారిపై అస్సాంలోని వివిధ ప్రాంతాల్లో దిగ్బంధాలు కొనసాగుతున్నాయని పునరుద్ఘాటించారు. ‘‘సోమవారం నుంచి శనివారం వరకు అస్సాం నుంచి మిజోరం రాష్ట్రానికి ఒక్క వాహనం కూడా రాలేదు’’ అని కొలాసిబ్‌ డిప్యూటీ కమిషనర్‌ హెచ్‌ లాల్తాంగ్లియానా చెప్పారు. అస్సాం మాత్రం ఈ 
ఆరోపణలను ఖండించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని