భాజపాకు భారీగా విరాళాలు

తాజా వార్తలు

Published : 05/08/2021 14:20 IST

భాజపాకు భారీగా విరాళాలు

ఐదు జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం కన్నా మూడు రెట్లు అధికం

దిల్లీ: భాజపాకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారీ స్థాయిలో విరాళాలు అందాయి. ఈ విషయంలో మరే ఇతర జాతీయ పార్టీ దాని దరిదాపులో కనిపించడం లేదు. కాంగ్రెస్, తృణమూల్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం.. ఈ ఐదు పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలతో పోల్చితే 3 రెట్లు అధికంగా కాషాయ పార్టీకి అందడం గమనార్హం. జాతీయ పార్టీలకు రూ.20 వేలకన్నా ఎక్కువగా వచ్చిన విరాళాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) సంస్థ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. ఆ 5 పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలు రూ.228.035 కోట్లు కాగా భాజపాకు రూ.785.77 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. మహారాష్ట్రలోని అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూడా కమలం పార్టీకి రూ.4.80 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించింది. ఓ ప్రభుత్వ సంస్థ అయిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వడం చట్టబద్ధమేనా అన్న ప్రశ్న తలెత్తుతోందని పేర్కొంది. ఇదిలా ఉండగా ముగ్గురు దాతల నుంచి భాజపాకు రూ.1.516 కోట్ల భూమి విరాళంగా వచ్చినట్లు ఏడీఆర్‌ వెల్లడించింది. వాటి దాతల వివరాలు సమగ్రంగా లేవని తెలిపింది. ఆయా పార్టీలు కొన్ని విరాళాల గురించి వెల్లడించిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొంది. భాజపా 570 విరాళాలు(రూ.149.875 కోట్లు), టీఎంసీ 52 విరాళాలు (రూ.7.1035కోట్లు), కాంగ్రెస్‌ 25 విరాళాలు(రూ.2.6875కోట్లు), ఎన్సీపీ 2 విరాళాలు (రూ.3.005 కోట్లు), సీపీఎం 39 విరాళాలు (రూ.1.0786కోట్లు), సీపీఐ 29 విరాళాల (రూ.52.17 లక్షలు)కు సంబంధించి చెక్, డీడీల వివరాలు సమగ్రంగా లేవని తెలిపింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని