Corona: ప్రపంచమా జాగ్రత్త.. ఒక్కరోజే 10 వేల మంది బలి

తాజా వార్తలు

Published : 14/08/2021 10:42 IST

Corona: ప్రపంచమా జాగ్రత్త.. ఒక్కరోజే 10 వేల మంది బలి

మళ్లీ కరోనా మృత్యుపంజా

న్యూయార్క్‌: కరోనా ధాటికి ప్రపంచం విలవిల్లాడుతోంది. ఇటీవల కాస్త నెమ్మదించినట్టే కనిపించిన మహమ్మారి.. మళ్లీ విరుచుకుపడుతోంది. 24 గంటల వ్యవధిలో అన్ని దేశాల్లో కలిపి 7 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 10 వేల మందికి పైగా మరణించారు. అమెరికాలో అత్యధికంగా 1.43 లక్షల కేసులు, 660 మరణాలు నమోదయ్యాయి. బ్రిటన్, ఇరాన్‌లో వైరస్‌ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. డెల్టా వేరియంట్‌ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అమెరికా ఆరోగ్య నియంత్రణ సంస్థ- ఎఫ్‌డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ మార్పిడి చేసుకున్న రోగులకు, బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి బూస్టర్‌ డోసు ఇవ్వాలని సూచించింది. అమెరికాలో 3 శాతం జనాభా ఈ అదనపు డోసుకు అర్హులని అధికారులు తెలిపారు. సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. బ్రిటన్‌లో కొత్తగా 33,074 కరోనా కేసులు బయటపడ్డాయి. జులై 23 తర్వాత నమోదైన అత్యధిక కేసులు ఇవేనని, డెల్టా వేరియంట్‌ వ్యాప్తే ఇందుకు కారణమని అక్కడి అధికారులు చెప్పారు. ప్రస్తుతం బ్రిటన్‌లోని 60 శాతం జనాభా రెండు డోసులు తీసుకోగా.. మిగిలిన వారికీ వేగంగా టీకాలు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు ఏమాత్రం అలక్ష్యంగా ఉండొద్దని, కరోనా నిబంధనలు పాటించకపోతే మరోసారి తీవ్రమైన ఉద్ధృతి వస్తుందని హెచ్చరించారు. ఆస్ట్రేలియాలో అధిక జనాభా ఉన్న రాష్ట్రం న్యూసౌత్‌వేల్స్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ఒక్కరోజే 390 మంది వైరస్‌ బారిన పడ్డారు. సిడ్నీలో జూన్‌ 26 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇరాన్‌లో ఒక్కరోజే 39 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. 568 మంది మరణించారు.

వుహాన్‌ ల్యాబ్‌పై..డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడి అనుమానం

చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో ఎలాంటి నైపుణ్యం, రక్షణ లేకుండానే కరోనా వైరస్‌పై పరిశోధనలు జరిగాయని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడు పీటర్‌ బెన్‌ ఎంబరెక్‌ సంచలన విషయాలు బయటపెట్టారు. చైనాలో కరోనా వైరస్‌ ఆవిర్భావం గురించి దర్యాప్తు చేసేందుకు వెళ్లిన నిపుణుల బృందంలో ఈయనొకరు. డానిష్‌ టీవీ 2 డాక్యుమెంటరీలో భాగంగా బెన్‌ ఈ విషయాలు వెల్లడించారు. జూన్‌లోనే రికార్డు చేసిన ఈ డాక్యుమెంటరీ తాజాగా బయటకు వచ్చింది. వుహాన్‌లోని సముద్ర జీవుల మార్కెట్లో జీవులకు, మనుషులకు మధ్య కాంటాక్ట్‌ అధికంగా ఉందని, అక్కడికి 500 మీటర్ల దూరంలోనే వుహాన్‌ సీడీసీ ల్యాబ్‌ ఉందని చెప్పారు. గబ్బిలాల నమూనాలు సేకరించే సమయంలో ల్యాబ్‌ సిబ్బంది కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ల్యాబ్‌లో భద్రతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. బెన్‌ మాటలతో.. వుహాన్‌లోనే తొలుత వైరస్‌ లీక్‌ అయిందనే అనుమానాలకు మరింత బలం చేకూరింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని