Covid Vaccine: డెల్టాపై కొవిడ్‌ టీకాలు సరైనవే కానీ..

తాజా వార్తలు

Updated : 20/08/2021 15:05 IST

Covid Vaccine: డెల్టాపై కొవిడ్‌ టీకాలు సరైనవే కానీ..

 ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే తక్కువ రక్షణ 

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న కొవిడ్‌-19లోని డెల్టా వేరియంట్‌ నుంచి రక్షణ పొందడానికి అత్యంత సమర్థ విధానం.. రెండు డోసుల టీకాను పొందడమేనని బ్రిటన్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఆల్ఫా రకంపై కన్నా ఒకింత తక్కువ రక్షణే లభిస్తుందని తేలింది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలపై ఈ అధ్యయనం సాగింది. ఇందులో 7లక్షల మందిని పరిశీలించారు. టీకా పొందినవారికి.. గతంలో ఇన్‌ఫెక్షన్‌ బారినపడినవారికి లభించే స్థాయిలోనైనా రక్షణ ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకసారి కొవిడ్‌కు గురైనవారు వ్యాక్సిన్‌ పొందితే ఈ రక్షణ మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. డెల్టా వేరియంట్‌ సాంక్రమిక శక్తి ఎక్కువగా ఉన్నట్లు కూడా తేలింది. రెండు డోసులు పొందినవారిలోనూ.. టీకా తీసుకోనివారితో సమానంగా వైరల్‌ లోడు ఉంటోందని గుర్తించారు. ఆల్ఫా వేరియంట్‌ సోకినవారిలో మాత్రం టీకా పొందని వారితో పోలిస్తే పొందినవారిలో వైరస్‌ స్థాయి తక్కువగా ఉంటోందని శాస్త్రవేత్తలు చెప్పారు. ‘‘తీవ్ర వ్యాధిని నివారించడంలో టీకాలు సత్తా చాటుతున్నాయి. అయితే వ్యాధి వ్యాప్తిలో మాత్రం ఇవి పెద్దగా సమర్థతను చూపలేకపోతున్నాయి. డెల్టా వేరియంట్‌ సోకినవారిలో వైరల్‌ లోడు ఉండటాన్ని బట్టి చూస్తే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం సవాలేనని స్పష్టమవుతోంది. టీకా పొందినవారి ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి జరుగుతుంది’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన కోయెన్‌ పౌవెల్స్‌ చెప్పారు. రెండో డోసు పొందిన రెండు వారాల తర్వాత.. వ్యాధి లక్షణాలతో కూడిన కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పించడంలో ఫైజర్‌ టీకా 93 శాతం మేర, ఆస్ట్రాజెనెకా 71 శాతం మేర సమర్థత చాటుతున్నట్లు వెల్లడైంది. అయితే కొంతకాలానికి ఫైజర్‌ సమర్థత తగ్గగా, ఆస్ట్రాజెనెకా టీకా విషయంలో మాత్రం అది పెద్దగా మార్పు లేదని స్పష్టమైంది. అయితే దీర్ఘకాల ప్రభావాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

వ్యాక్సిన్‌ తీసుకున్నా ‘డెల్టా’ ముప్పు: ఐసీఎంఆర్‌

దిల్లీ: కరోనాలోని డెల్టా వేరియంట్‌.. వ్యాక్సిన్‌ వేయించుకున్న, వేయించుకోనివారికి సమానస్థాయిలో సోకుతోందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. కానీ టీకా వేయించుకున్నవారిలో మరణాల రేటు తగ్గుతుందని పేర్కొంది. చెన్నైలో తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు తేలినట్లు వివరించింది. తదుపరి వచ్చే కరోనా వేవ్‌లను తగ్గించాలంటే.. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించింది. కొత్త వేరియంట్లను, వాటి ప్రభావశీలతను అంచనా వేయడానికి జీనోమిక్‌ సర్వేలను కొనసాగించాలంది. రోగనిరోధక ప్రతిస్పందన వ్యవస్థ నుంచి తప్పించుకోగల కొత్త ఉత్పరివర్తనాల ఆవిర్భావం కారణంగా మళ్లీ భారీస్థాయిలో ఇన్‌ఫెక్షన్లు సంభవించవచ్చని తెలిపింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని