దారితప్పి అడవిపాలైన మూడేళ్ల బాలుడు..

తాజా వార్తలు

Updated : 07/09/2021 12:44 IST

దారితప్పి అడవిపాలైన మూడేళ్ల బాలుడు..

 మూడు రోజుల తర్వాత అమ్మానాన్నల చెంతకు

కాన్‌బెర్రా: ముద్దులొలికే మూడేళ్ల పసివాడు.. ఆడుకుంటూ దారితప్పి అడవిలోకి పోయాడు. దీనికితోడు ఆటిజం ఉంది. మాటలూ రావు. మూడు రోజుల వరకూ అమ్మానాన్నలను కాదు కదా మనిషన్నవాడినే చూడలేదు. ఆకలికి తాళలేక, భయంతో నిద్రపట్టక ఎంత బాధ అనుభవించాడో.. ఎన్నిసార్లు ఏడ్చాడో.. అదంతా అరణ్య రోదనే అయింది. ఒంటి మీద చొక్కా, డైపర్‌ తప్ప చెప్పులు కూడా లేకుండా రాళ్లూరప్పలు దాటుకుంటూ తిరిగాడు. చివరకు ఓ సెలయేరు దగ్గర చేతులతో నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తూ గాలింపు బృందం కంటపడ్డాడు. ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆంటోనీ ఎల్‌ఫలక్‌కు ఎదురైన అనుభవమిది. ఉత్తర సిడ్నీలోని మారుమూల గ్రామం పుట్టీకి కాస్త దూరంగా ఉన్న ఓ ఇంట్లో ఆంటోనీ కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం ఉన్నట్లుండి ఆంటోనీ అదృశ్యమయ్యాడు. అతడి కోసం వందల మంది గాలింపు చేపట్టారు. ఆంటోనీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులూ రంగంలోకి దిగారు. హెలికాప్టర్లతో అటవీప్రాంతంలో ఆంటోనీ జాడ కోసం వెతికారు. సోమవారం సాయంత్రం అతడి ఆచూకీ కనిపెట్టారు. ఇంటికి సుమారు 470 మీటర్ల దూరంలో ఓ సెలయేరు దగ్గర అతడు కనిపించినట్లు అధికారులు చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తమ కుమారుడు మళ్లీ దొరకడం ఓ అద్భుతమని ఆంటోనీ తండ్రి ఉద్వేగంతో చెప్పారు. తల్లి కనిపించిన వెంటనే ఆంటోనీ ఆమెను అతుక్కుపోయాడని, కళ్లలోకి చూస్తూ నిద్రలోకి జారుకున్నాడని వెల్లడించారు. లేచిన వెంటనే ఆకలితో పిజ్జా, అరటి పండు లాగించాడన్నారు. నీరు దొరకడం వల్లే అతడు ప్రాణాలతో ఉండగలిగాడని వైద్యులు చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని