Afghanistan: మహిళలను మనుషుల్లా చూడట్లేదు

తాజా వార్తలు

Published : 17/09/2021 10:07 IST

Afghanistan: మహిళలను మనుషుల్లా చూడట్లేదు

 అఫ్గాన్‌లో పరిస్థితులపై పలువురి ఆవేదన 

దిల్లీ: తమ దేశంలో ప్రస్తుతం స్త్రీల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అఫ్గానిస్థాన్‌కు చెందిన పలువురు మహిళా ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీలను తాలిబన్లు మనుషులుగా కాకుండా జంతువులుగా చూస్తున్నారని తెలిపారు. దిల్లీలో భారతీయ మహిళా ప్రెస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో తాజాగా నిర్వహించిన సమావేశంలో అఫ్గాన్‌ పార్లమెంటు మాజీ సభ్యురాలు షింకాయ్‌ కరోఖైల్‌ మాట్లాడుతూ.. ‘‘అఫ్గాన్‌లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అక్కడ చాలామంది మహిళా కార్యకర్తలు, రాజకీయ నేతలు చిక్కుకుపోయారు. తాలిబన్లు వారి ఇళ్లకు వెళ్లి మరీ భయపెడుతున్నారు. వారి కార్లను స్వాధీనం చేసుకుంటున్నారు. మహిళలను గొంతెత్తనివ్వడం లేదు’’ అని వివరించారు. ‘‘1990ల్లో అఫ్గాన్‌లో అధికారంలో ఉన్నప్పుడు తాలిబన్లు మహిళలపై దాడులకు పాల్పడ్డారు. వారి హక్కులను కాలరాశారు. హత్యలు చేశారు. 2001 నుంచి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఎంతో శ్రమపడ్డారు. ఇప్పుడు అదంతా వృథా అవుతోంది’’ అంటూ పరిశోధకురాలు, హక్కుల కార్యకర్త హుమెరా రిజాయ్‌ కన్నీటిపర్యంతమయ్యారు. తాలిబన్లు మహిళలను జంతువులుగా చూస్తున్నారని పాత్రికేయురాలు ఫాతిమా ఫరమార్జ్‌ పేర్కొన్నారు. 

తాలిబన్లకు ప్రోత్సాహకాలివ్వాలి: ఇమ్రాన్‌ ఖాన్‌ 

ఇస్లామాబాద్‌: తాలిబన్లతో తమ సత్సంబంధాలను పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి స్పష్టంగా బయటపెట్టారు. వారితో సంబంధాలు నెలకొల్పుకోవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. మహిళల హక్కులను పరిరక్షించేలా, సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేలా తాలిబన్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలనీ కోరారు. అఫ్గాన్‌ వ్యవహారాలపై ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ బుధవారం ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘‘అఫ్గాన్‌ ప్రస్తుతం ఓ కీలక మలుపులో ఉంది. ఇప్పుడేమైనా బెడిసికొడితే.. గందరగోళం తలెత్తుతుంది. శరణార్థుల సమస్య తీవ్రమవుతుంది. ఆ గడ్డపై ఉగ్రవాదం మళ్లీ పేట్రేగుతుంది. అవేవీ జరగకుండా ఉండాలంటే.. తాలిబన్లతో అంతర్జాతీయ సమాజం సంబంధాలు ఏర్పరుచుకోవాలి. ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలి. అంతేతప్ప వారిని ఏ విషయంలోనూ బలవంతం చేయకూడదు. అఫ్గాన్‌ను బయటి నుంచి నియంత్రించగలమనుకోవడం ఓ భ్రమ. అంతర్జాతీయ సహాయం లేకుండా అఫ్గాన్‌లో పరిస్థితులను చక్కబెట్టలేమని తాలిబన్లు కూడా భావిస్తున్నారు. కాబట్టి వారిని సరైన దిశలో నడిపించాలి. చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు, హామీలను నిలబెట్టుకునేందుకు వారికి తగినంత సమయమివ్వాలి’’ అని పేర్కొన్నారు. అఫ్గాన్‌ యుద్ధంలో అమెరికాతో చేతులు కలిపాక పాక్‌ చాలా నష్టపోయిందని ఇమ్రాన్‌ అన్నారు. ‘‘అమెరికా అధ్యక్ష పీఠమెక్కి నెలలు గడుస్తున్నా జో బైడెన్‌ ఇప్పటికీ మీకు ఎందుకు ఫోన్‌ చేయలేదు?’’ అన్న ప్రశ్నకు.. ‘‘ఆయన తీరిక లేని మనిషి’’ అని పాక్‌ ప్రధాని బదులిచ్చారు.

రంగుల దుస్తులతో నిరసన బాట

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో స్త్రీల వస్త్రధారణపై తాలిబన్లు ఆంక్షలు విధించడంతో ఓ మహిళ నిరసనబాట పట్టారు. రంగురంగుల సంప్రదాయ దుస్తుల్లో తాను దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా బుర్ఖా ధరించాలంటూ తాలిబన్లు తాజాగా అఫ్గాన్‌లో ఆదేశాలు జారీ చేశారు. దానిపై చాలామందికి అభ్యంతరం ఉన్నా.. ఎదురు మాట్లాడేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో బహార్‌ జలాలీ అనే మహిళ అంతర్జాలం వేదికగా ‘నా దుస్తుల్ని తాకొద్దు’ అంటూ ఓ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆమె అమెరికన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌లో మాజీ అధ్యాపకురాలు. జలాలీ తాలిబన్ల ఆదేశాలను ధిక్కరిస్తూ.. రంగురంగుల సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలు దిగి, వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. అఫ్గానీల అసలైన వస్త్రధారణ, సంస్కృతిగా ఆ దుస్తులను పేర్కొన్నారు. పూర్తిగా బుర్ఘా ధరించిన కొందరు మహిళల ఫొటోలను మరో పోస్ట్‌లో పెట్టి.. ‘‘ఇది మన సంప్రదాయం కానే కాదు. ఇలాంటి వస్త్రధారణలో చూస్తే మనల్ని గ్రహాంతర వాసులుగా ఇతరులు భావించే ముప్పుంది’’ అంటూ వ్యాఖ్య జోడించారు. మెల్లమెల్లగా పలువురు మహిళలు సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతుండటం గమనార్హం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని