Amit Shah: చర్చలు యువతతోనే.. పాకిస్థాన్‌తో కాదు: అమిత్‌షా

తాజా వార్తలు

Published : 26/10/2021 09:09 IST

Amit Shah: చర్చలు యువతతోనే.. పాకిస్థాన్‌తో కాదు: అమిత్‌షా

నూతన అభివృద్ధి దిశగా జమ్మూకశ్మీర్‌ పయనం
శ్రీనగర్‌లో బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌ కవచాన్ని తొలగించి ప్రసంగించిన అమిత్‌ షా

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా చూడాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. ఈ ప్రాంత పురోగతి కోసం ఇక్కడి ప్రజలతో మాట్లాడేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి పాకిస్థాన్‌తో చర్చలు జరపాలంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా చేసిన సూచనను ఆయన తోసిపుచ్చారు. కశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం శ్రీనగర్‌లోని ఎస్‌కేఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు అక్కడ ఏర్పాటు చేసిన బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌ కవచాన్ని అమిత్‌ షా తొలగించారు. కశ్మీరీ సోదరసోదరీమణులతో నేరుగా మాట్లాడాలని ఉందని తెలిపారు.

‘‘పాకిస్థాన్‌తో చర్చలపై ఫరూక్‌ అబ్దుల్లా చేసిన సూచనను పత్రికల్లో చదివాను. అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఆయనకు ఉంది. అయితే, కశ్మీరీ యువత, సోదరసోదరీమణులతో నేరుగా చర్చలు జరపాలన్నదే మా ఆకాంక్ష. నన్ను తీవ్రంగా విమర్శించారు. శపించారు. అయినా సరే విశాల హృదయంతో, రక్షణ లేకుండా, బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌ లేకుండా మీ ముందు నిలుచున్నా’’ అని కేంద్ర హోంమంత్రి తెలిపారు. కశ్మీర్, జమ్మూ, లద్దాఖ్‌ ప్రాంతాలను అభివృద్ధిపథంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకప్రతిపత్తిని కల్పించే అధికరణం 370ని రద్దు చేశామని ఆయన పునరుద్ఘాటించారు. ఇక్కడి అభివృద్ధి ఫలాలు 2024కల్లా అందరికీ కనిపిస్తాయని పేర్కొన్నారు. కశ్మీర్‌లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. వచ్చే ఏడాది చివరికల్లా రూ.50వేల కోట్ల పెట్టుబడులు ఇక్కడకు వస్తాయని భరోసా వ్యక్తం చేశారు. స్థానికులకు 5లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ‘‘ప్రధాని మోదీ చొరవతో రాష్ట్రంలో కొత్తగా ఏడు వైద్య కళాశాలలు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటి ద్వారా ఇప్పుడు 2000 మంది యువకులు వైద్యులవుతారు. వైద్య విద్య చదవడం కోసం ఇక ఎవరూ పాకిస్థాన్‌కు వెళ్లనవసరంలేదు’’ అని అన్నారు. 

ఖీర్‌ భవాని ఆలయ సందర్శన

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కశ్మీరీ పండిట్ల ఆరాధ్య దేవత ఖీర్‌ భవానీ ఆలయాన్ని సందర్శించారు. గందేర్బల్‌ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కశ్మీరీ సంప్రదాయ దుస్తులను ధరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని