పాఠశాల వద్ద పేలుడు..  30 మంది బలి

తాజా వార్తలు

Updated : 09/05/2021 07:34 IST

పాఠశాల వద్ద పేలుడు..  30 మంది బలి

కాబూల్‌లో ముష్కర చర్య

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఒక బాలికల పాఠశాల వద్ద ఉగ్రవాదులు శనివారం శక్తిమంతమైన బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థినులే. వీరంతా 11-15 ఏళ్ల వయసున్నవారే. మరో 50 మంది గాయపడ్డారు. పౌరులను లక్ష్యంగా చేసుకొని జరిపిన ఈ దాడిని తాలిబన్లు ఖండించారు. ఈ దుశ్చర్యతో తమకు సంబంధం లేదన్నారు. పశ్చిమ కాబుల్‌లోని దష్ట్‌-ఎ-బార్చి జిల్లాలో సయద్‌ అల్‌ షాదా పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది. ఇది షియా వర్గం వారు ఎక్కువగా ఉండే ప్రాంతం. శనివారం భారీ శబ్దంతో విస్ఫోటం సంభవించిందని స్థానికులు తెలిపారు. మూడు వేర్వేరు పేలుళ్ల శబ్దాలను విన్నానని ఓ వ్యక్తి చెప్పాడు. అయితే ఈ వాదనను అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. బాంబు పేలుడు జరిగిన వెంటనే అంబులెన్సులతో వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే పేలుడుపై ఆగ్రహానికి లోనైన స్థానికులు.. అంబులెన్సులపై దాడి చేశారు. వైద్య సిబ్బందిపై చేయి చేసుకున్నారు. రక్తసిక్తమైన పాఠశాల బ్యాగ్‌లు, పుస్తకాలతో ఘటనాస్థలం హృదయవిదారకంగా ఉంది. సమీపంలోని ఆసుపత్రిలో బాధితులు, వారి కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. ఈ బాంబు పేలుడుకు ఏ ఉగ్రవాద ముఠా ఇప్పటివరకూ బాధ్యత వహించలేదు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని