వైఫల్యాల అంగీకారం నేతల నరాల్లోనే లేదు

తాజా వార్తలు

Updated : 20/05/2021 07:57 IST

వైఫల్యాల అంగీకారం నేతల నరాల్లోనే లేదు

దిల్లీ హైకోర్టు వ్యాఖ్య

దిల్లీ: తప్పులు, అసమర్థతను అంగీకరించడం రాజకీయ నాయకులు, అధికార్లకు చాలా కష్టమని, ఇది వారి నరాల్లోనే లేదని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కింది కోర్టుల న్యాయ ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారంటూ దాఖలైన దావాపై విచారణ జరుపుతున్న సందర్భంగా బుధవారం పై వ్యాఖ్య చేసింది. దిల్లీలో ముగ్గురు న్యాయాధికారులు కరోనాతో మృతి చెందారని, అందువల్ల కోర్టు ఉద్యోగులను కూడా పోలీసులు మాదిరిగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తించవలసి ఉందని తెలిపింది. ‘‘సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు రాజ్యాంగ పరమైన హోదా ఉంది. కింది స్థాయి కోర్టుల పరిస్థితి వేరు. న్యాయాధికారుల రక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది’’ అని జస్టిస్‌ విపిన్‌ సంఘి, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చికిత్సల విషయంలో జిల్లా జడ్జీలు, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందంటూ గతంలోనే ఉత్తర్వులు ఇచ్చామని దిల్లీ ప్రభుత్వం చేసిన వాదనను తిరస్కరించింది. ‘‘నిర్ణయం అమలు కాలేదు. అందుకే మళ్లీ ఇక్కడ విచారణ జరుగుతోంది. వైఫల్యాలు, చేతకానితనాన్ని రాజకీయ నాయకులు, అధికారులు అంగీకరించడం చాలా కష్టం. వారెప్పుడూ దాన్ని ఒప్పుకోరు. అది వారి నరాల్లో లేదు’’ అని వ్యాఖ్యానించింది. ‘‘జడ్జి కుమారుడో, కుమార్తో, భార్యో కరోనా బారిన పడినప్పుడు ఆయన విధులు నిర్వర్తిస్తారని ఆశించలేం. ఎలాంటి ఆదేశాల కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వమే వారి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాలి’’ అని సూచించింది.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని