Corona: మాస్కులు మానేశారు!

తాజా వార్తలు

Updated : 17/07/2021 08:08 IST

Corona: మాస్కులు మానేశారు!

74% తగ్గిన వినియోగం : కేంద్రం
వచ్చే 125 రోజులు కీలకం

దిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన తర్వాత మాస్కుల వినియోగం 74 శాతం మేర తగ్గిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. మూడో ఉద్ధృతి రావడానికి అవకాశాలను కొట్టిపారేయలేమని.. కొవిడ్‌పై పోరులో వచ్చే 125 రోజులు అత్యంత కీలకమని పేర్కొంది. కొవిడ్‌ ఆంక్షలు సడలించి వివిధ కార్యకలాపాలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు మాస్కులు పెట్టుకోవడం తగ్గినట్లు తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈమేరకు దిల్లీలో ఆయనతో పాటు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ విలేకరులతో మాట్లాడారు. మే-జులై నెలల మధ్య ప్రజలు తిరుగాడటం పెరిగినట్లు గూగుల్‌ మొబిలిటీ డేటా సూచిస్తోందని.. ఇది వైరస్‌ వ్యాప్తికి కారణమవుతుందని లవ్‌ అగర్వాల్‌ హెచ్చరించారు.

హెర్డ్‌ ఇమ్యూనిటీ (సామూహిక రోగనిరోధక శక్తి) దశకు భారత్‌ ఇంకా చేరుకోలేదని వీకే పాల్‌ తెలిపారు. కొవిడ్‌ మరిన్ని ఉద్ధృతులకు అవకాశాలున్నాయని.. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు.

కేసులు, మరణాలు తగ్గుముఖం

దేశంలో రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న కొవిడ్‌ కేసులు శుక్రవారం కొంత తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడో రోజు మరణాలు తగ్గడం కొంత ఊరట. గత 24 గంటల్లో 38,949 కొత్త కేసులు బయటపడగా.. 542 మంది కొవిడ్‌తో మృతి చెందారు. దేశవ్యాప్తంగా గురువారం 19,55,910 కొవిడ్‌ పరీక్షలు జరిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని