24×7.. ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చు
close

తాజా వార్తలు

Published : 03/03/2021 14:40 IST

24×7.. ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చు

24 రాష్ట్రాల్లో మరణాల్లేవ్‌: కేంద్రం

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి ఉద్ధృతి నియంత్రణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. నిత్యం దాదాపు 15వేల కేసులు నమోదవుతున్నప్పటికీ, రోజువారీ కొవిడ్‌ మరణాల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24గంటల్లో దేశంలోని 24 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కొవిడ్‌ మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, దిల్లీ, రాజస్థాన్‌వంటి రాష్ట్రాల్లోనూ కరోనా మరణాలు సంభవించలేదని తెలిపింది.

గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 98 మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే 88శాతం మరణాలు చోటుచేసుకున్నాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలోనే అత్యధికంగా 54 మంది మృత్యువాతపడ్డారు. కేరళలో 16, పంజాబ్‌లో 10 మరణాలు నమోదయ్యాయి. దేశంలో నిన్న 14,989 కేసులు నమోదు కాగా, వీటిలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 7863 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కేరళలో 2938, పంజాబ్‌లో 729 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. కేరళ, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో క్రియాశీల కేసులు తగ్గాయి, మహారాష్ట్ర, పంజాబ్‌, దిల్లీ, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో మాత్రం ఇవి క్రమంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

24x7టీకా పంపిణీ..

‘దేశంలో కొవిడ్‌ టీకా పంపిణీ వేగవంతం చేయడంలో భాగంగా వీటిపై ఉన్న సమయ పరిమితిని ప్రభుత్వం తొలగించింది. ప్రజలు అనువైన సమయంలో 24x7 ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చు. ప్రజల ఆరోగ్యం, సమయం విలువను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్థం చేసుకున్నారు’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అందుచేత టీకా పంపిణీకి ఆసుపత్రులు నిర్ణీత షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, వీటిని ఏ సమయంలోనైనా పంపిణీ చేసే వెసులుబాటు ఉందని సూచించారు. ఇక ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఏ సమయంలోనైనా టీకా పంపిణీ చేసుకోవచ్చని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. కొవిన్‌ యాప్‌ పోర్టల్‌లో కేవలం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అని ఉన్నప్పటికీ, అంతకు ముందు లేదా సమయం గడిచిన తర్వాత వ్యాక్సిన్‌ పంపిణీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసుపత్రుల సామర్థ్యాన్ని బట్టి టీకా పంపిణీ సమయాలను నిర్దేశించుకోవచ్చన్నారు. ఇలాంటి సమయాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందిస్తే సరిపోతుందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ సందర్భంగా టీకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ భారీగా నిల్వ చేసుకోవద్దని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. 

ఇదిలాఉంటే, ఇప్పటివరకు దేశంలో కోటి 56లక్షల మందికి కొవిడ్‌ టీకా అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని