Vaccine: టీకా వేసుకో.. కోరింది తీసుకో
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 09:16 IST

Vaccine: టీకా వేసుకో.. కోరింది తీసుకో

బీరు, లాటరీలు, షాపింగ్‌ ఓచర్లు, కోళ్లు 

న్యూయార్క్‌: మానవాళికి కొవిడ్‌ ముప్పు తప్పించే వ్యాక్సినేషన్‌ లక్ష్యసాధన వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న ధ్యేయంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రజలను ఆకట్టుకునే ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం పెంచడం ద్వారా ఈ మహమ్మారి నుంచి ఇకనైనా విముక్తి పొందాలనే ధ్యేయంతో కొన్నిచోట్ల సర్కారుకు తోడు దుకాణాల యజమానులు కూడా తాయిలాలు అందిస్తుండటం అభినందనీయం. ఉచిత బీరు మొదలు లాటరీలు, నగదు బహుమతులు.. చివరకు కోళ్లు కూడా ఉదారంగా ఇస్తున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో టీకా తీసుకొన్నవారికి ఉచిత బీరు అందిస్తుండగా.. 
ఒరెగాన్, ఒహాయో రాష్ట్రాల్లో మిలియన్‌ డాలర్ల నగదు లాటరీలు పెట్టారు. కాలిఫోర్నియాలో 116.5 మిలియన్‌ డాలర్ల బహుమతులు ప్రకటించారు. వాషింగ్టన్‌ రాష్ట్రంలో ‘జాయింట్స్‌ ఫర్‌ జాబ్స్‌’ కార్యక్రమం నడుస్తోంది. జులై 12లోపు వ్యాక్సిన్‌ పొందిన 21 ఏళ్లు పైబడ్డ వ్యక్తులకు డ్రగ్స్‌ పరిధిలోకి వచ్చే ‘మరిజువానా’ లైసెన్స్‌డ్‌ దుకాణాల్లో ఓ కన్నాబిస్‌ జాయింట్‌ ఉచితంగా ఇస్తున్నారు. ఇదే రాష్ట్రంలో 2 మిలియన్‌ డాలర్ల ‘గివ్‌ అవే’ బహుమతులు కూడా ప్రకటించారు. అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియా రాష్ట్ర పాలకులు లాటరీ స్కీం పెట్టి బహుమతుల కింద వేటకు ఉపయోగించే రైఫిళ్లు, షాట్‌గన్స్‌ ఇస్తున్నారు. ఇండోనేసియాలోని

పశ్చిమ జావా 

ప్రావిన్సులో టీకా వేసుకుంటే ఓ కోడి ఉచితం. ఇజ్రాయెల్‌ వ్యాక్సినేషనులో ముందంజలో ఉన్నప్పటికీ టెల్‌ అవీవ్‌ నగరంలో టీకా వేసుకుంటే ఉచితంగా ‘మందు’ పోస్తున్నారు. సెర్బియాలో డిస్కౌంట్‌ షాపింగ్‌ ఓచర్లు ఇస్తుండటంతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం క్యూలు కడుతున్నారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నగరంలో ఓ కేఫ్‌ యజమాని ‘కాఫీ ఫ్రీ’ అంటున్నారు.

భారత్‌లో బర్గర్లు, అధిక వడ్డీలు

బెంగళూరు, భోపాల్‌: అమెరికా వంటి ఆధునిక దేశాల్లోనే కొవిడ్‌ టీకాలకు ఉచితాలు ప్రకటిస్తుంటే.. వ్యాక్సినేషన్‌కు కొన్నిచోట్ల ఇప్పటికీ వెనకడుగు వేస్తున్న భారత్‌లో ఊరుకుంటారా! దేశంలో ఫాస్ట్‌ఫుడ్‌ రంగంలో వేళ్లూనుకున్న మెక్‌డొనాల్డ్‌ సంస్థ 20 శాతం మినహాయింపు ప్రకటించింది. గృహోపకరణాల సంస్థ గోద్రెజ్‌ తమ ఉత్పత్తుల వారంటీ గడువులో మినహాయింపులు ఇస్తోంది. ఒక్క డోసు వేసుకున్నా 
సరే.. డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఇస్తామని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఈ సదుపాయాలు పొందాలంటే.. ప్రభుత్వం జారీ చేసిన వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలు కచ్చితంగా చూపాల్సి ఉంటుంది.

వ్యాక్సిన్‌ వేసుకోకపోతే.. వేతనం లేనట్టే 

వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం చేరుకునేందుకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు జులై 31లోపు టీకాలు వేసుకోకపోతే జీతాలు ఇవ్వబోమని ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  
* మధ్యప్రదేశ్‌లోని భాజపా ఎమ్మెల్యే విష్ణు ఖత్రి తన నియోజకవర్గంలో జూన్‌ 30లోపు వ్యాక్సిన్‌ వేేయించుకున్నవారికి ఉచిత మొబైల్‌ రీఛార్జి ప్రకటించారు. ఇదే రాష్ట్రంలోని మరో ఎమ్మెల్యే 100% వ్యాక్సినేషన్‌ సాధించిన గ్రామానికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని