ఇక 45 ఏళ్లు పైడిన వారికి టీకా..!

తాజా వార్తలు

Published : 18/03/2021 13:10 IST

ఇక 45 ఏళ్లు పైడిన వారికి టీకా..!

యోచిస్తోన్న కేంద్రం

దిల్లీ: ఒకవైపు కరోనా వైరస్ టీకా కార్యక్రమం సజావుగా సాగుతున్నా..కొద్ది వారాలుగా కరోనా కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఈ టీకా కార్యక్రమంలో వేగం, విస్తృతిని పెంచి, వైరస్‌కు అడ్డకట్ట వేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రాధాన్య క్రమంలో 45 ఏళ్లు పైబడిన వారందరిని చేర్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు దశల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, 60 ఏళ్లు పైబడిన (45 ఏళ్లు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన) వారికి కేంద్రం టీకాలు పంపిణీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిధిని విస్తృతం చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను పలు రాష్ట్రాలు అభ్యర్థిస్తున్నాయి. 

‘45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు అందించే విషయం పరిశీలనలో ఉంది. క్రమంగా ప్రభుత్వం అన్ని వర్గాల వారికి టీకాలు అందించాలి. అయితే, ప్రస్తుతం కొవిడ్ విజృంభిస్తుండటంతో.. అధిక సంఖ్యలో ప్రజలకు టీకాలు అందించి, వారికి రక్షణ కల్పించాల్సి ఉంది. ప్రస్తుత ప్రక్రియ ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఐసీఎంఆర్‌కు చెందిన ఉన్నతాధికారి సిమ్రన్ పాండా వెల్లడించారు. 

అలాగే మనదేశంలో టీకా వృథా కూడా ఎక్కువగా ఉంది. దీనిపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇప్పటివరకు 75.4 మిలియన్ల డోసుల టీకాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసింది. దాంట్లో 6.5 శాతం వృథా అయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని వృథా దేశ సగటును మించి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 10 శాతానికి పైగా టీకా వృథా అవుతోందని స్వయంగా ప్రధానే ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇతర వయసు వర్గాలను కూడా టీకా కార్యక్రమంలో చేర్చాలనే డిమాండ్లకు ఊతం ఇస్తోంది. అలాగే వృథా ఎంత తక్కువగా ఉంటే..అంత ఎక్కువ మందికి టీకాలు అందుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్‌ భూషణ్ అన్నారు.

ఇదిలా ఉండగా..దాదాపు వంద రోజుల తరవాత దేశంలో రికార్డు స్థాయిలో 35,871 కొత్త కేసులు వెలుగుచూశాయి. 188 మరణాలు సంభవించాయి. దీని కట్టడి కోసం నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమం కింద నిన్నటి వరకు 3,71,43,288 మందికి టీకాలు అందించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని