టీకా పంపిణీ: 4 రోజుల్లోనే కోటి డోసులు..!

తాజా వార్తలు

Published : 26/03/2021 23:29 IST

టీకా పంపిణీ: 4 రోజుల్లోనే కోటి డోసులు..!

ఇతర గ్రూపుల వారికి అందించేందుకు ప్రయత్నం
టీకాపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. గడిచిన నాలుగు రోజుల్లోనే దేశంలో కోటి కరోనా డోసులను పంపిణీ చేశామన్నారు. దేశంలో తయారవుతోన్న వ్యాక్సిన్‌లపై ప్రజలకు ఉన్న విశ్వాసం, వ్యాక్సిన్‌ తీసుకోవాలన్న తపన వల్లే ఇది సాధ్యమైందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని, రానున్న రోజుల్లో ఇతర వయసుల వారికి వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

‘వ్యాక్సిన్‌ అభివృద్ధికి సాధారణంగా కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఒక్కోసారి దశాబ్ద కాలం పట్టవచ్చు. కానీ, భారత్‌లో కేవలం 11నెలల వ్యవధిలోనే వ్యాక్సిన్‌ను తీసుకురాగలిగాం’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా స్వదేశీ సంస్థ భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను అందుబాటులోకి తీసుకురావడం భారత్‌ సామర్థ్యాలను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పిందన్నారు. దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందన్న ఆయన, వ్యాక్సినేషన్‌ కోసం బడ్జెట్‌లో రూ.35వేల కోట్లను కేటాయించినందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశంసించారు.

దేశంలో జనవరి 16వ తేదీన వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాగా తొలి 34రోజుల్లో కోటి డోసులను పంపిణీ చేశారు. ఇలా ఇప్పటివరకు 5కోట్ల 55లక్షల డోసులను పూర్తిచేశారు. తొలుత కరోనా పోరులో కీలక పాత్ర వహించిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా అందించగా, ప్రస్తుతం 60ఏళ్ల వయసు పైబడిన వారందరికీ టీకా అందిస్తున్నారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 45ఏళ్లు దాటిన వారందరూ వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టే కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించవచ్చనడానికి టీకా పంపిణీ ఓ ఉదాహరణ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అభిప్రాయపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని