లోక్‌సభలో బుల్లెట్‌ రైలు Vs మెట్రో‌!
close

తాజా వార్తలు

Published : 10/03/2021 19:47 IST

లోక్‌సభలో బుల్లెట్‌ రైలు Vs మెట్రో‌!

దిల్లీ: మహారాష్ట్రకు సంబంధించిన రెండు కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులపై లోక్‌సభలో బుధవారం ఆసక్తికర చర్చ నడిచింది. ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపించగా.. మెట్రో కార్‌షెడ్‌ తరలింపు విషయంలో కేంద్రం భూమిని ఇవ్వడం లేదంటూ శివసేన ఎంపీలు తప్పుబట్టారు. ఈ రెండు అంశాలపై చర్చ సందర్భంగా ఇరు పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు నడిచాయి. బుల్లెట్‌ ప్రాజెక్టుకు మహారాష్ట్రలో భూసేకరణ ఆలస్యం జరుగుతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్రం ఆరోపిస్తోంది. మరోవైపు మెట్రో కార్‌షెడ్‌ ప్రాజెక్టును ఆరే కాలనీ నుంచి కంజూర్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూమి కేంద్రం పరిధిలోనిది కావడం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించకపోవడంతో రెండు ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొనడం ఇందుకు నేపథ్యం.

శివసేనకు చెందిన ఎంపీ ప్రతాప్‌రావు జాదవ్‌ బుల్లెట్‌ రైలు గురించి అడిగిన ప్రశ్నతో ఈ చర్చ మొదలైంది. ముంబయి- నాగ్‌పూర్‌ మధ్య బుల్లెట్‌ రైలు నడిపే ఉద్దేశం ఏదైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. దీనికి రైల్వే మంత్రి పీయూష్‌ గోయాల్‌ సమాధానమిస్తూ.. ‘ప్రపంచస్థాయి సదుపాయాలతో హైస్పీడ్‌ రైల్వేను ముంబయి- అహ్మదాబాద్‌ మధ్య నడపాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. గుజరాత్‌లో 95 శాతం, దాద్రా నగర్‌ హవేలీలో దాదాపు భూసేకరణ పూర్తయ్యింది. కానీ మహారాష్ట్రలోని మహా అఘాడీ ప్రభుత్వం ప్రాజెక్టును ముందుకు కదలనీయడం లేదు. ఆ రాష్ట్ర పరిధిలో 24 శాతం మాత్రమే భూసేకరణ జరిగింది’ అని గోయల్‌ అన్నారు. ఇదే అంశంపై ముంబయికి చెందిన భాజపా ఎంపీ మనోజ్‌ కోటక్‌ స్పందిస్తూ.. ముంబయి- అహ్మదాబాద్‌ రైలును అడ్డుకున్నవాళ్లు.. నాగ్‌పూర్‌కు రైలు గురించి ఎలా అడుగుతారని ప్రశ్నించారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జాదవ్‌కు ఈ సందర్భంగా గోయల్‌ సూచించారు.

దీనిపై జాదవ్‌ స్పందిస్తూ.. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును వ్యతిరేకించేందుకు కారణాలు ఉన్నాయన్నారు. ముంబయిలోని అన్ని ప్రభుత్వ శాఖల తరలింపు చేపట్టి, ముంబయి ప్రాధాన్యాన్ని తగ్గించాలనుకుంటున్నారని జాదవ్‌ అన్నారు. దీనిపై గోయల్‌ స్పందిస్తూ.. 2014-19 మధ్య భాజపా ప్రభుత్వమే అధికారంలో ఉందని, ఆ సమయంలో ఎలాంటి తరలింపులూ జరగలేదు కదా అని అన్నారు. కానీ అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు అని సమాధానం ఇచ్చారు.  శివసేన ఎంపీ అర్వింద్‌ సావంత్‌ జోక్యం చేసుకుని మెట్రో కార్‌షెడ్‌ ప్రాజెక్టుకు (కంజూర్‌లో) కేంద్రం భూమి ఇవ్వడం లేదని, ఈ విషయంలో రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదన్నారు. దీనిపై గోయల్‌ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అహం వల్లే ఆ సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయిందని, చాలా ప్రాజెక్టులు కూడా అందుకే నిలిచిపోయాయంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని