
తాజా వార్తలు
మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ ఆజాద్
నిజాలను దాచని వ్యక్తి అని అభినందించిన కాంగ్రెస్ దిగ్గజం
శ్రీనగర్: కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై అసమ్మతి వ్యక్తంచేస్తోన్న సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రధాని హోదాలో ఉన్నప్పటికీ.. గ్రామీణ నేపథ్యాన్ని, చాయ్‌వాలా అని తన మూలాల గురించి నరేంద్ర మోదీ చెప్పుకోవడం గొప్ప విషయమన్నారు. జమ్మూ కశ్మీర్లో గుజ్జర్లు ఏర్పాటుచేసిన ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్న ఆజాద్, నిజాన్ని దాచని వ్యక్తిత్వం మోదీ సొంతమని అభినందించారు.
‘చాలా మంది నాయకుల్లో మంచి విషయాలను ఇష్టపడతాను. నేను కూడా గ్రామీణ ప్రాంతం వచ్చిన వ్యక్తినే, ఇందుకు గర్వపడుతున్నాను. గ్రామీణ ప్రాంత వ్యక్తిగా, చాయ్‌వాలా అని మోదీ చెప్పుకోవడం గర్వపడే విషయం. రాజకీయంగా మేము ప్రత్యర్థులమే కావచ్చు, కానీ, ఆయన నిజాన్ని నిర్భయంగా చెప్పుకోవడాన్ని అభినందిస్తున్నాను’ అని కాంగ్రెస్ దిగ్గజ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి అయినప్పటికీ తన మూలాలను మరచిపోని వ్యక్తి నరేంద్ర మోదీ అని, అలాంటి వ్యక్తి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, ఫిబ్రవరి 9 తేదీన గులాం నబీ ఆజాద్‌కు వీడ్కోలు కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో ఆజాద్ రాజకీయ జీవితంపై ప్రసంగించిన ప్రధాని మోదీ, ఆజాద్ లాంటి వ్యక్తి నాకు నిజమైన మిత్రుడని కన్నీటి పర్యంతమయ్యారు. ఆజాద్ సేవలను, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా ఆయనను ఎన్నటికీ పదవీ విరమణ చేయనివ్వబోమని, ఆజాద్ సేవలను ఉపయోగించుకుంటామని ప్రధాని మోదీ అన్నారు.
ఇదిలాఉంటే, కాంగ్రెస్ అధినాయకత్వం తీరును ప్రశ్నిస్తూ ‘జి-23’గా పేరుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు తాజాగా జమ్మూ కశ్మీర్లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని, దాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆజాద్ అనుభవాలను కాంగ్రెస్ పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని విమర్శించారు. ఇది మరువకు ముందే, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరోసారి ప్రధానమంత్రిని అభినందించడం గమనార్హం. ఇక ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేతల తీరు పార్టీకి మింగుడుపడని విషయంగానే చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.