వర్ష బీభత్సం.. కోల్‌కతా రోడ్లపై మోకాలి లోతు నీరు! 
close

తాజా వార్తలు

Published : 17/06/2021 17:55 IST

వర్ష బీభత్సం.. కోల్‌కతా రోడ్లపై మోకాలి లోతు నీరు! 

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కోల్‌కతా నగరం తడిసి ముద్దవుతోంది. నిన్నటి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నైరుతి రుతుపవనాలు  పశ్చిమబెంగాల్‌పై తీవ్ర ప్రభావం చూపడంతో  రాబోయే మూడు రోజుల్లో బెంగాల్‌లోని అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో కోల్‌కతా నగరంలోని అనేక వీధులు, రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. 

ఉత్తర కోల్‌కతా కంటే దక్షిణ కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లోనే అధిక వర్షపాతం నమోదైంది. బల్లిగంజ్‌ సర్కిల్‌ రహదారి, లౌడన్‌ స్ట్రీట్‌, సదరన్‌ అవెన్యూ, కస్బా, బెహలా, టోలిగంజ్‌ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. ఈ రోజు ఉదయం 8గంటల వరకు కోల్‌కతాలో 144 మి.మీల వర్షపాతం నమోదైంది. వీధుల్లో మోకాలి లోతు నీరు ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ 24పరగణాస్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 178.6 మి.మీల వర్షపాతం నమోదు కాగా.. బంకురలో 133.2 మి.మీల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, డార్జిలింగ్‌లో 70మి.మీల వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, ప్రజలు కూడా ఇళ్లలోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని