జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్‌!
close

తాజా వార్తలు

Published : 24/06/2021 00:53 IST

జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్‌!

శ్రీనగర్‌: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం దిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాల్లో 48 గంటలపాటు హై అలర్ట్‌ విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించడం సహా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను సైతం నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాజ్యాంగంలోని అధికరణ 370ను రద్దు చేసిన రెండేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌ నేతలతో కేంద్రం భేటీ కానుండటం గమనార్హం. అక్కడి సమస్యలపై చర్చించేందుకు గురువారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌ డిక్లరేషన్‌(పీఏజీడీ) సహా కాంగ్రెస్‌, ఇతర రాజకీయ పార్టీల నేతలు ఇప్పటికే తమ అంగీకారం తెలిపారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్మూకశ్మీర్‌ భాజపా అధ్యక్షుడు రవీందర్‌ రైనా, మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్‌ గుప్తా బుధవారం దిల్లీ బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఈ సమావేశానికి జమ్మూకశ్మీర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీఏ మిర్‌, మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్‌ హాజరవనున్నట్లు తెలిసింది.   

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని