బిహార్‌లో‌ వికసించిన కమలం..!

తాజా వార్తలు

Updated : 10/11/2020 18:24 IST

బిహార్‌లో‌ వికసించిన కమలం..!

స్పష్టంగా కనిపించిన మోదీ ప్రభావం 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు.. అన్న నానుడికి ఈ సారి బిహార్‌ ఎన్నికలే నిలువుటద్దం. 2015 ఎన్నికల్లో ఆర్‌జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ కూటమిగా పోటీ చేశాయి. 2020 నాటికి ఆ కూటమిలోని ప్రధాన పార్టీ భాజపాతో జట్టుకట్టి ఏన్‌డీఏలో చేరింది. కానీ, ఎన్నికల ఫలితాలు వచ్చే కొద్దీ.. జేడీయూ, ఆర్‌జేడీలు బలహీనపడగా.. భాజపా పుంజుకొన్నట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో భాజపా 53 సీట్లు మాత్రమే సాధించింది. దీంతో కొన్నాళ్లు ప్రతిపక్షంలో కూర్చొంది. ఆర్‌జేడీ(80)తో కలిసి జేడీయూ(71) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  2017లో జేడీయూ ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నీతీశ్‌ భాజపా మద్దతు కూడగట్టారు. కొన్ని గంటల్లోనే తిరిగి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నుంచి చిన్నచిన్న విభేదాలు ఉన్నా.. ఎన్‌డీఏతో కొనసాగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, జేడీయూ, ఎల్‌జేపీ కలిసి బరిలోకి దిగాయి. దాదాపు క్లీన్‌ స్వీప్‌ చేశాయి. కేవలం ఒక్క సీటు మాత్రమే ప్రతిపక్ష యూపీఏకు దక్కింది. ఇక  ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీకి ఒక్కసీటు కూడా దక్కపోవడం విశేషం. 

చిరాగ్‌ నుంచి హామీ..

2019 పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాను విశ్లేషించిన భాజపా ఇక్కడ ప్రధాని మోదీ హావా బలంగా ఉందని భావించింది. దీంతో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే కూటమితో బరిలోకి దిగాలని భావించింది. కానీ, జేడీయూతో విభేదాల కారణంగా ఎల్‌జేపీ కూటమి బయటకు వెళ్లిపోయింది. ఒక దశలో ఆ పార్టీ 143 స్థానాలకు పోటీ చేయాలని భావించింది. చిరాగ్‌ ఆ మొత్తం సీట్లలో గెలవక పోవచ్చు.. కానీ, ప్రత్యర్థిని ఓడించేలా ఓట్లను చీల్చగలడు. ఇది జరిగితే కూటమి ఓట్లు భారీగా తగ్గడం ఖాయం. ఈ క్రమంలో భాజపా నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగి చర్చలు జరిపారు. భాజపా బరిలో ఉన్నచోట్ల తాము బరిలోకి దిగమని హామీ తీసుకొన్నారు. ఇది కొంత మేరకు భాజపా ఓట్లు చీలకుండా చూసింది. ఎల్‌జేపీతో వైరం ఫలితాన్ని జేడీయూ అనుభవిస్తోంది. కూటమిలో భాజపాకు అధిక సీట్లు దక్కాయి.  

సీట్ల సర్దుబాటులో పట్టు విడుపు..

మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటులో భాజపా పట్టువిడుపు ధోరణిలో వ్యవహరించింది. దీంతో మిత్రపక్షమైన జేడీయూకు 115 సీట్లను ఇచ్చి.. తాను 110 సీట్లతో సర్దుకొంది. 2015లో భాజపా ఈ రాష్ట్రంలో 157 స్థానాల్లో పోటీ చేసింది. మిగిలిన సీట్లను మిత్రపక్షాలైన వీఐపీ, హెచ్‌ఏంలకు కేటాయింది. కూటమి నుంచి బయటకు వెళ్లిన ఎల్‌జేపీ 135 స్థానాల్లో బరిలో నిలిచింది. జేడీయూ ఓట్లను చీల్చింది. అదే సమయంలో కొంత ప్రభుత్వ ఓట్లను కూడా ఆర్జేడీ నుంచి చీల్చింది. ఇది అంతిమంగా భాజపాకు లబ్ధిచేకూర్చింది.  

ఇప్పటికే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో భాజపా ఓడిపోవడం.. లేదా ప్రతిపక్షాలు బలపడటమో జరిగాయి. 2021లో కీలకమైన అసోం, కేరళ, పాండిచేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీల ఎన్నికలు జరగనున్నాయి. బీహార్‌ ఎన్నికల్లో భాజపా కూటమి గెలిస్తే.. అక్కడి పార్టీ కేడర్‌లో నైతిక స్థైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో కాషాయ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉండటం.. బీహార్లో మిస్టర్ క్లీన్‌గా నితీశ్‌ కుమార్‌కు ఇమేజ్‌ ఉండటంతో సీట్ల పంపిణీలో ఉదారంగా వ్యవహరించింది.    

ఫలించిన ప్రధాని మోదీ ర్యాలీలు..

ప్రధాని మోదీ చరిష్మా ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఆయన కూటమి తరపున ప్రచారం చేస్తూ మొత్తం 12 సభల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధాని పర్యటించిన  నియోజకవర్గాల్లో ప్రస్తుతం కూటమి అభ్యర్థులు మందంజలో ఉన్నారు. 

ఆకర్షణీయమైన హామీలు..

ఈ సారి బీహార్‌ ఎన్నికల్లో పార్టీలు పోటీపడి హామీలు ఇచ్చాయి. భాజపా రాష్ట్రంలో 3లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తి చేస్తామని ప్రకటించింది. దీంతోపాటు మూడు కోట్ల మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇక 30 లక్షల పక్కా గృహాలు.. ఆరోగ్య రంగంలో లక్ష ఉద్యోగాలు వంటి తాయిలాలను ప్రకటించింది. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని