close

తాజా వార్తలు

Updated : 22/04/2021 09:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Corona: ప్రాణవాయువు కోసం భారీ డిమాండ్‌

కొరతపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం

ఈనాడు-దిల్లీ, లఖ్‌నవూ, గువాహటి: కొవిడ్‌ బాధితుల సంఖ్య అమాంతం పెరిగిపోవడంతో దాని ప్రభావం వైద్య సదుపాయాలపైనా పడుతోంది. ఆక్సిజన్‌ సరఫరా, ప్రాణాధార ఔషధాల కొరత సమస్య ఎదురవుతోంది. దేశవ్యాప్తంగా మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా గత రెండు నెలల్లో నాలుగింతలు పెరిగిందని కేంద్రం పేర్కొంది. ఫిబ్రవరి చివరి వారంలో ఒక్కోరోజు 1,273 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా కాగా.. ఏప్రిల్‌ 17 నాటికి 4,739 మెట్రిక్‌ టన్నుల వరకు సరఫరా చేసినట్లు తెలిపింది. అయినప్పటికీ ఈ విషయంలో రాష్ట్రాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. తమ రాష్ట్ర కోటాను ప్రస్తుత 250 మెట్రిక్‌ టన్నుల నుంచి 325 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ డిమాండ్‌ చేశారు. దిల్లీ కోటాను ప్రస్తుత 378 మెట్రిక్‌ టన్నుల నుంచి 700 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శిశోడియా కోరారు. తమ రాష్ట్రానికి వస్తున్న ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను దిల్లీ ప్రభుత్వం లూటీ చేసిందని హరియాణా మంత్రి అనిల్‌ విజ్‌ ఆరోపించారు. ఇదే సమయంలో దిల్లీకి ఆక్సిజన్‌ ట్యాంకర్లు రాకుండా హరియాణా అడ్డుపడుతోందని సిసోదియా ప్రత్యారోపణ చేశారు. దిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆందోళన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బుధవారం ఆక్సిజన్‌ను సరఫరాను పెంచారు. మహారాష్ట్రలోని పలు వైద్యశాలల్లో ప్రాణవాయువు కొరత ప్రధాన సమస్యగానే ఉంది. దేశవ్యాప్తంగా ప్రాణవాయువు సరఫరా సాఫీగా సాగేలా చేసేందుకు మరికొన్ని రోజులు ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల’ను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. గుజరాత్‌లోని బనస్కాంఠ జిల్లాలో ఆక్సిజన్‌ కొరతతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

కేంద్రానికి దిల్లీ హైకోర్టు ఆదేశం

ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత నివారణకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకోలేకపోయిందని దిల్లీ హైకోర్టు మండిపడింది. మ్యాక్స్‌ హాస్పిటల్స్‌ దాఖలు చేసిన ఓ అత్యవసర పిటిషన్‌పై బుధవారం సెలవు దినం అయినప్పటికీ జస్టిస్‌ విపిన్‌ సంఘి, జస్టిస్‌ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పరిశ్రమలలో తయారుచేసి అక్కడే వినియోగిస్తున్న ఆక్సిజన్‌ను కొన్నాళ్లపాటు దిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు మళ్లించటంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది.

లోడు రావడమే ఆలస్యం..

మధ్యప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను దుండగులు దోచుకుపోయారు. దమోహ్‌ జిల్లా ఆసుపత్రికి ఆక్సిజన్‌ సిలిండర్లతో నిండిన ట్రక్కు వచ్చి ఆగింది. ఇంతలోనే కొందరు దుండగులు అక్కడికి వచ్చి సిలిండర్లను ఎత్తుకెళ్లారు. వారిపై కేసు నమోదు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

మందులను నల్లబజారుకు తరలిస్తే...

కరోనా బాధితులకు ప్రాణాధారమైన ఔషధాలను నల్లబజారుకు తరలించే వారిపై జాతీయ భద్రత చట్టం కింద చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. ఆక్సిజన్‌ తయారీ కేంద్రాల నుంచి బయలుదేరే ట్యాంకర్లకు పోలీసులతో బందోబస్తు కల్పించాలని సూచించారు.

ప్రాణ వాయువుకు కొరత రానీయం: కేంద్రం

దిల్లీ: దేశంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు 7,500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుండగా, అందులో 6,600 మెట్రిక్‌ టన్నులను వివిధ రాష్ట్రాల ఆరోగ్య అవసరాల కోసం కేటాయించినట్టు పేర్కొంది. రానున్న రోజుల్లో ప్రాణవాయువు సరఫరాను మరింత పెంచనున్నట్టు తెలిపింది. నీతి ఆయోగ్‌ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్‌ వి.కె.పౌల్‌ మాట్లాడుతూ కరోనా రోగులకు ప్రాణం పోసే ఆక్సిజన్‌ను చాలా హేతుబద్ధంగా ఉపయోగించాలని అన్ని ఆసుపత్రులను కోరారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ మాట్లాడుతూ ప్రాణవాయువు సరఫరాను పర్యవేక్షించడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. లారీల రాకపోకలకు సంబంధించిన సమస్యలు దగ్గర నుంచి అన్నింటినీ దీని ద్వారా పర్యవేక్షిస్తారని తెలిపారు. ఇలాంటి భారీ విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉందని చెప్పారు. విదేశాల నుంచి 50వేల మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ దిగుమతి చేసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని