రాజ్యాంగ హక్కులను విస్మరిస్తారా?

తాజా వార్తలు

Published : 15/06/2021 23:19 IST

రాజ్యాంగ హక్కులను విస్మరిస్తారా?

కేంద్రాన్ని ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు

దిల్లీ: ఆందోళనలను అణిచివేయాలనే తొందరలో రాజ్యాంగ హక్కులను విస్మరిస్తారా? అంటూ కేంద్ర సర్కారును దిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఏదైనా సమస్యపై ఆందోళన చేసేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు, ఉగ్రవాద చర్యలకు మధ్య ఉన్న భేదాన్ని ప్రభుత్వం గుర్తించలేకపోయినట్టుంది అని వ్యాఖ్యానించింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో  ఏడాది క్రితం అరెస్టయిన ముగ్గురు ఆందోళనకారులకు బెయిలు మంజూరు చేసిన సందర్భంగా సర్కారుపై కోర్టు మంగళవారం తాజా వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాదులపై ఉపయోగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం(యూఏపీఏ)కు సంబంధించి ఉగ్రవాదం, ఉగ్రవాద చర్యల స్వభావాన్ని గుర్తించాలని సూచించింది. ఆ చట్టాన్ని సాధారణ నేరాలకు వినియోగించొద్దని కోరింది. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని అభిప్రాయపడింది. 

మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ‘పింజ్రా తోడ్‌’ సంస్థలో సభ్యులైన నటాషా నర్వాల్‌, దేవంగన కలిత, జామియా మిలి ఇస్లామియా విద్యార్థి అసిఫ్ ఇక్బాల్‌ తన్హా దిల్లీ అల్లర్ల కేసులో గతేడాది మేలో అరెస్టయ్యారు.  ఆ అల్లర్లకు సంబంధించి ప్రధాన సూత్రధారులుగా పేర్కొంటూ ట్రయల్‌ కోర్టు వారికి ఆ సమయంలో బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే వారిపై నిర్దిష్టమైన ఆరోపణలేవీ  లేవంటూ ధర్మాసనం దిగువ కోర్టు ఆదేశాలను పక్కన పెట్టింది.  రెండు వేర్వేరు తీర్పుల్లో వారికి బెయిలు మంజూరు చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సహా పాస్‌పోర్టుల అప్పగింత, ఇతర నిబంధనల మేరకు వారికి కోర్టు బెయిల్‌ ఇచ్చింది. 

నటాషా నర్వాల్ (32), దేవంగన కలిత (31)  జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన విభాగంలో పీహెచ్‌డీ విద్యార్థులు. నటాషా నర్వాల్  తండ్రి కొవిడ్‌తో మృతి చెందడంతో మూడు నెలల క్రితం ఆమెను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేశారు. దేవంగన కలిత బెయిల్ పిటిషన్‌ను జనవరిలో సెషన్స్‌ కోర్టు తిరస్కరించింది. డిగ్రీ పరీక్షలకు హాజరయ్యేందుకు  అసిఫ్ ఇక్బాల్‌ తన్హాకు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని