Delta variant: డెల్టా దెబ్బకు అగ్రదేశంలో ఐసీయూల కొరత

తాజా వార్తలు

Updated : 09/08/2021 15:30 IST

Delta variant: డెల్టా దెబ్బకు అగ్రదేశంలో ఐసీయూల కొరత

కరోనా తీవ్రతపై ఫోన్‌, ఈ మెయిల్‌ సందేశాలు..

వాషింగ్టన్‌: అగ్రదేశం అమెరికా మరోసారి కరోనా కోరల్లో చిక్కుకుంది. ఈ సారి డెల్టా రకం ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైరస్ తీవ్రతకు కొన్ని ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఉన్న ఐసీయూ పడకలు .. 10 లోపునకు పడిపోయాయని అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా టెక్సాస్ రాజధాని ప్రాంతం అస్టిన్ పరిస్థితి అదుపుతప్పింది. లక్షల్లో ఉన్న జనాభాకు ప్రస్తుతం 6 ఐసీయూ పడకలే మిగిలి ఉండటంతో అక్కడి యంత్రాంగం ప్రమాద ఘంటికలు మోగించింది. వైద్య సేవలు అందుబాటులోనే ఉన్నప్పటికీ.. పెరుగుతున్న కేసుల దృష్ట్యా వనరులు పరిమితంగా ఉన్నాయంటూ ప్రజలను అప్రమత్తం చేసింది.

కరోనా తీవ్రతపై ఫోన్‌, ఈ మెయిల్‌ సందేశాలు..

అస్టిన్‌లో కొవిడ్ తీవ్రతపై పబ్లిక్ మెడికల్ హెల్త్ డైరెక్టర్ డెస్మార్ వాక్స్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఆసుపత్రులు దాదాపుగా నిండిపోయాయి. పరిస్థితి మా చేయి దాటిపోతోంది’ అని పేర్కొంటూ అక్కడి ప్రజలకు ఫోన్, ఈ మెయిల్‌ సందేశాలు పంపారు. డెల్టా విజృంభణతో ఆరోగ్య శాఖ ప్రమాద హెచ్చరికను అత్యధిక స్థాయి ఐదుకు పెంచింది. అలాగే అర్హులంతా టీకాలు వేయించుకోవాలని, టీకాలు వేయించుకున్నా మాస్కులు ధరిస్తూ, సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించింది. అక్కడ గతనెల ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య సగటున వారం రోజులకు ఆరు రెట్లు పెరిగింది. దాంతో ఈ ప్రమాద స్థాయిని పెంచారు. ఐసీయూల్లో చేరుతున్న బాధితులు సంఖ్య భారీగా పెరుగుతోంది. జులై 4న వెంటిలేటర్లపై ఉన్న కొవిడ్ బాధితుల సంఖ్య ఎనిమిదిగా ఉండగా.. గత శనివారం నాటికి అది 102కి పెరిగిందని ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అస్టిన్ ప్రాంతంలో కరోనా కేసులు 10 రెట్లు పెరగడంతో పరిస్థితి మరీ చేయిదాటిపోయే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

అమెరికా వ్యాప్తంగా పెరుగుతోన్న కేసులు..

అమెరికా వ్యాప్తంగా కూడా డెల్టా పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా రోజుకు సగటున లక్ష కేసులు వెలుగుచూస్తున్నాయి.  మళ్లీ శీతకాలం నాటి ఉద్ధృతి కనిపిస్తోందని జాన్‌ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం, బ్లూమ్‌బర్గ్ డేటా వెల్లడిస్తోంది. కొన్ని నెలల క్షీణత తర్వాత ప్రస్తుతం అక్కడ టీకా కార్యక్రమంలో వేగం పుంజుకుంది. ఈ సమయంలోనే కేసులు కూడా పెరుగుతున్నాయి. గత నెలతో పోల్చుకుంటే మరణాలు రెట్టింపయ్యాయి. కిందటి ఉద్ధృతితో పోల్చితే అవి తక్కువే అయినప్పటికీ.. కొత్త ఉత్పరివర్తనాల పట్ల అక్కడి వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ‘కరోనా వైరస్‌ చాలా చెడ్డ మలుపు తీసుకుంది’ అంటూ ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం తీవ్రతకు అద్దం పడుతోంది.

జూన్‌ నెల చివరిలో రోజువారీ సగటు కేసులు 11 వేలకుపడిపోగా.. ఈ నెల 3 నుంచి లక్షకు పైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది మొదటి ఉద్ధృతిలో రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటడానికి 9 నెలలు పట్టగా.. ఇప్పుడు ఆరు వారాల్లోనే ఆ సంఖ్యను దాటేసింది. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం..అమెరికాలో 3.6 కోట్లకుపైగా కరోనా కేసులు..6లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని