
తాజా వార్తలు
నాడు పాక్ వద్దంది.. నేడు భారత్ ఓకే చెప్పింది
దిల్లీ: కశ్మీర్ విషయంలో భారత్‌ను రెచ్చగొడుతూ కయ్యానికి కాలుదువ్వుతున్న దాయాది దేశం పాకిస్థాన్ ఆ మధ్య మన విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఆ దేశానికి మన గగనతలం మీదుగా వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు భారత్ ఏ మాత్రం అడ్డుచెప్పకుండా అనుమతులు మంజూరు చేయడం గమనార్హం.
శ్రీలంక పర్యటనకు వెళ్తున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విమానం భారత్ మీదుగా వెళ్లేందుకు కేంద్రం అంగీకరించింది. పాక్ విమానం భారత గగనతలాన్ని వినియోగించుకునేందుకు అనుమతి కల్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
సాధారణంగా వీవీఐపీ విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు అన్ని దేశాలు అనుమతి కల్పిస్తాయి. అయితే పాక్ మాత్రం గతంలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని భారత్‌పై అర్థంలేని ఆరోపణలు చేస్తున్న పాక్.. 2019లో భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా నిషేధం విధించింది. భారత ప్రధాని వెళ్లే వీవీఐపీ విమానానికి కూడా అనుమతి ఇవ్వలేదు. పాక్ మీదుగా అమెరికా, సౌదీ అరేబియా వెళ్లేందుకు మోదీ విమానానికి అనుమతి నిరాకరించింది. దీంతో మరో మార్గంలో ఆ విమానం వెళ్లింది. పాక్ తీరుపై భారత్ అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థకు ఫిర్యాదు చేసింది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నేడు శ్రీలంక వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడితో ఇమ్రాన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. కాగా.. శ్రీలంక పార్లమెంట్లో ఇమ్రాన్ ప్రసంగం చేయాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఈ కార్యక్రమాన్ని లంక రద్దు చేయడం గమనార్హం.