Kargil war: మాంచెస్టర్‌ మైదానంలో కార్గిల్‌ యుద్ధం..! 

తాజా వార్తలు

Updated : 26/07/2021 15:16 IST

Kargil war: మాంచెస్టర్‌ మైదానంలో కార్గిల్‌ యుద్ధం..! 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌-పాక్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే దాని ఓల్టేజే వేరు. అదే వరల్డ్‌ కప్‌ అయితే.. అభిమానులు ఫుల్‌ఛార్జింగ్‌లో ఉంటారు.. ఇక రెండు దేశాల సైనికుల మధ్య భీకర పోరు జరుగుతున్న సమయంలో జరిగే మ్యాచ్‌ ఎలా ఉంటుందో ఊహించుకోలేము. మైదానం యుద్ధక్షేత్రాన్నే తలపిస్తుంది. కార్గిల్‌ యుద్ధ సమయంలో ఇలాంటి మ్యాచ్‌ ఒకటి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగింది. వరల్డ్‌కప్‌ వచ్చినా.. రాకపోయినా.. ఈ మ్యాచ్‌ మాత్రం భారత్‌ గెలవాలని అభిమానులు కోరుకున్నారు.  మైదానంలో ‘1999 వరల్డ్‌ కప్‌, కార్గిల్‌ రెండూ మావే’ అంటూ పాక్‌ ఫ్యాన్స్‌ ప్లకార్డులను చూపడంతో వారిని బయటకు పంపాల్సి వచ్చింది. దీనిని బట్టే మ్యాచ్‌పై ఆయా దేశాల అభిమానుల అంచనాలను అర్థం చేసుకోవచ్చు. 

కార్గిల్‌ పర్వత సానువుల్లో భారత సైనికులు పోరాడుతుంటే.. 1999 ప్రపంచకప్‌లో భాగంగా జూన్‌ 8వ తేదీన భారత్‌-పాకిస్థాన్‌లు సూపర్‌ సిక్స్‌ పోరులో తలపడ్డాయి. గ్రూప్‌-ఏలో  అజహర్‌ నేతృత్వంలోని భారత్‌ 5 మ్యాచులాడి 3 విజయాలు సాధించింది. వసీమ్‌ అక్రమ్‌ నేతృత్వంలోని పాక్‌ జట్టు 5 మ్యాచుల్లో 4 గెలిచి భీకరమైన ఫామ్‌తో సూపర్‌ సిక్స్‌కు చేరింది.

అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న గంగూలీ అనారోగ్య కారణాలతో  ఈ మ్యాచ్‌లో ఆడలేదు. భారత్‌ హిట్‌ ఓపెనింగ్‌ జోడీకి బ్రేక్‌ పడింది. షోయబ్‌ అక్తర్‌కు భయపడి గంగూలీ తప్పుకొన్నాడని అప్పట్లో పాక్‌ మీడియా ట్రోల్‌ చేసింది. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ తీసుకొంది. గంగూలీ స్థానంలో ఎస్‌.రమేశ్‌ ఓపెనింగ్‌కు వచ్చాడు. సచిన్‌-రమేశ్‌ భారత్‌కు నిలకడైన ప్రారంభాన్ని అందించారు. 11.2 ఓవర్లకు 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక రమేష్‌ వికెట్‌ను అబ్దుల్‌ రజాక్‌ తీసుకొన్నాడు. 

వన్డేల్లో స్థానం సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ద్రవిడ్‌ బరిలోకి దిగాడు. సచిన్‌-ద్రవిడ్‌ జోడీ  స్కోర్‌బోర్డును 95కు చేర్చారు. 20.5వ ఓవర్లో సచిన్‌ (45) వికెట్‌ను అజర్‌ మహమూద్‌ తీసుకొన్నాడు. పాక్‌ ఆనందానికి అవధులు లేవు. తర్వాత వచ్చిన అజేయ్‌ జడేజా కూడా వెంటనే ఔటయ్యాడు.  దీంతో కెప్టెన్‌ అజహరుద్దీన్‌-ద్రవిడ్‌లు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత భుజానా వేసుకొన్నారు. ద్రవిడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఇజాజ్‌ అహ్మద్‌ జారవిడవడం భారత్‌కు కలిసొచ్చింది. ద్రవిడ్‌ అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. ద్రవిడ్‌ (61) తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్‌ సింగ్‌ కూడా అజహర్‌కు సహకరించాడు. దీంతో భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. పాక్‌ తరపున అక్రమ్‌, అజర్‌ మహమూద్‌ చెరో రెండు వికెట్లు తీసుకొన్నారు. భారత్‌ ఉన్న ఫామ్‌ ప్రకారం ఈ స్కోర్‌ చాలా తక్కువ. 

పాక్‌ వెన్ను విరిచిన కన్నడ త్రయం..

ఏది ఏమైనా ఈ మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదని భారత్‌ బృందం నిర్ణయించుకొంది. జట్టుకు విజయం అందించే బాధ్యతను బౌలింగ్‌ దళం  నెత్తికెత్తుకొంది.  కన్నడ త్రయంగా పేరున్న జవగళ్‌ శ్రీనాథ్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌,అనిల్‌ కుంబ్లేలు పాక్‌ వెన్నువిరిచారు. ఈ ముగ్గురే 10 వికెట్లు తీసుకొన్నారు. వెంకటేశ్‌ ప్రసాద్‌ ఏకంగా ఐదు వికెట్లు తీసుకొని పాక్‌ పతనాన్ని శాసించాడు. ఆ జట్టులో అత్యధికంగా 41 పరుగులు చేసిన ఇంజమామ్‌ 93 బంతులు ఎదుర్కొన్నాడంటే భారత బౌలింగ్‌ పదును అర్థం చేసుకోవచ్చు. ఇంజీ తర్వాత మొయిన్‌ ఖాన్‌, సయ్యద్‌ అన్వర్‌లు మాత్రమే చెప్పుకో దగ్గ పరుగులు చేశారు. పాక్‌ జట్టు 45.3 ఓవర్లలో 180 పరుగులకే పెవిలియన్‌ చేరుకొంది. దీంతో వరల్డ్‌ కప్‌లో పాక్‌పై విజయాల రికార్డును భారత్‌ 5-0తో మెరుగు పర్చుకొంది. వెంకటేశ్‌ ప్రసాద్‌ వన్డే బెస్ట్‌ 5/27 ఈ మ్యాచులో నమోదైంది.  ఈ మ్యాచ్‌ కథాంశంగా 2003లో ‘స్టంప్డ్‌’ అనే సినిమా కూడా విడుదలైంది. దీంట్లో సచిన్‌,రాహుల్‌ ద్రవిడ్‌,కపిల్‌దేవ్‌,యువరాజ్‌సింగ్‌ వంటి క్రికెటర్లు స్క్రీన్‌పై  కనిపించారు. 

స్వీట్‌ గిఫ్ట్‌..

భారత్‌ ఈ మ్యాచ్‌ను గెలిచిన మర్నాడే సైన్యం దేశానికి ఓ బహుమతిని ఇచ్చింది. బటాలిక్‌ సెక్టార్‌ నుంచి పాక్‌ మూకలను తరిమికొట్టింది. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని