
తాజా వార్తలు
పది వేల దిగువకు కరోనా కేసులు
24 గంటల్లో 9,102 కొత్త కేసులు..117 మరణాలు
దిల్లీ: దేశంలో సోమవారం రోజువారీ కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్త కేసుల సంఖ్య జూన్ కనిష్ఠానికి చేరింది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..పాజిటివ్ కేసుల సంఖ్య పదివేల దిగువకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో 7,25,577 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..9,102 వైరస్ కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1.06 కోట్లుగా ఉంది. అలాగే క్రియాశీల కేసులు 1,77,266కు చేరుకున్నాయి. దాంతో ఆ రేటు 1.73 శాతానికి తగ్గింది.
ఇక, నిన్న కరోనా నుంచి 15,901 మంది కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు 1,03,45,985 మంది వైరస్ నుంచి బయటపడినట్లయింది. రికవరీ రేటు 96.83 శాతానికి చేరింది. ఈ మహమ్మారి కారణంగా తాజాగా 117 మరణాలు సంభవించాయి. మొత్తం మృతుల సంఖ్య 1,53,587గా ఉంది.
మరోవైపు, జనవరి 25(రాత్రి 7:10) వరకు 19,50,183 మందికి కరోనా వైరస్ టీకాను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 3,34,679 మంది టీకా తీసుకున్నట్లు ట్వీట్ చేసింది. జనవరి 16న మనదేశంలో భారీ కరోనా వైరస్ టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మొదటి దశలో కింది స్థాయి వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు అందిస్తున్నారు.
ఇవీ చదవండి:
రఫేల్..రామమందిరం..గణతంత్ర విశేషాలు