
తాజా వార్తలు
భారత్ : 97 శాతానికి చేరిన రికవరీ రేటు..
దిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో 5,50,426 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,689 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం వెల్లడించిన వివరాలతో పోలిస్తే.. నేడు రోజువారీ కేసుల సంఖ్య పెరగడం గమనార్హం. ఇక మొత్తం కేసుల సంఖ్య 1,06,89,527కి చేరింది. కొత్తగా 13,320 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,03,59,305కు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.91 శాతానికి పెరిగింది.
ఇక మరణాల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 137 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,53,724కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,76,498కు తగ్గింది. ఇక మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు టీకా తొలి డోసు అందిన వారి సంఖ్య 20,29,480కు చేరింది. తొలి విడతలో పారిశుద్ధ్య కార్మికులు, కిందిస్థాయి ఆరోగ్య సిబ్బంది టీకాలు పొందుతున్న విషయం తెలిసిందే. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగం కింద ప్రజలకు అందిస్తున్నారు.
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10 కోట్లు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 10,02,48,229గా నమోదవగా.. మరణాల సంఖ్య 21,56,850కు చేరింది. ఇక అమెరికా 2,53,62,794 కేసులు, 4,23,010 మరణాలతో తొలిస్థానంలో ఉండగా.. భారత్, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇవీ చదవండి...
బ్రిటన్ ప్రయాణికుల్లో ‘పాజిటివ్’ కలకలం