కరోనా ఉద్ధృతి: 40 వేలు దాటిన కేసులు

తాజా వార్తలు

Updated : 20/03/2021 10:47 IST

కరోనా ఉద్ధృతి: 40 వేలు దాటిన కేసులు

40,953 కొత్త కేసులు..188 మరణాలు

దిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా మహమ్మారి తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. రెండో దశలో కొత్త కేసులు పైపైకి ఎగబాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,60,971 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..40,953 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. సుమారు నాలుగు నెలల తరవాత ఈ స్థాయిలో రోజువారీ కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1.15 కోట్లకు పైబడింది. మరణాలు సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా 188 మంది మృత్యు ఒడికి చేరగా..నిన్నటివరకు 1,59,558 మంది ప్రాణాలు వదిలారు. ఇక, క్రియాశీల కేసులు 2,88,394కి పెరిగాయి. నిన్న ఒక్కరోజే 23,653 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా వైరస్‌ను జయించిన వారి సంఖ్య 1,11,07,332కి చేరగా..రికవరీ రేటు 96.26 శాతంగా ఉంది. శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను వెల్లడించింది.

34 కంటైన్‌మెంట్ జోన్లు, 305 భవనాలకు సీల్‌:
మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. మొదటి దశ కంటే రెండో దశలో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో శుక్రవారం రికార్డు స్థాయిలో 25,681 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో మూడు వేలకు పైగా కేసులు ముంబయిలోని బయటపడ్డాయి. 2020 అక్టోబర్ 7న అత్యధికంగా 2,848 కొత్త కేసులు వెలుగుచూడగా..రెండో దశలో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మార్చి 14 నుంచి ఆరు రోజుల వ్యవధిలో ఒక్క ఆర్థిక రాజధానిలోనే 13,912 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో మహమ్మారి తీవ్రతను కట్టడి చేసే క్రమంలో కంటైన్‌మెంట్ జోన్లు, సీల్‌ చేసిన భవనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చి 18 నాటికి 34 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండగా, 305 భవనాలను బీఎంసీ సీల్ చేసింది. 
4.20 కోట్ల మందికి అందిన టీకా..
జనవరి 16 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఈ క్రమంలో మార్చి ఒకటిన రెండో దశను కూడా ప్రారంభించింది. కాగా, మార్చి 19 నాటికి 4,20,63,392 మందికి ప్రభుత్వం టీకాలు సరఫరా చేసింది. నిన్న ఒక్కరోజే 27,23,575 మంది టీకాలు వేయించుకున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని