కరోనా కాటుకు 714 మంది బలి

తాజా వార్తలు

Updated : 03/04/2021 14:41 IST

కరోనా కాటుకు 714 మంది బలి

ఒక్కరోజే 89,129 మందికి కొవిడ్ 

5 శాతానికి చేరిన క్రియాశీల రేటు

దిల్లీ: రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 714 మంది ప్రాణాలను హరించింది. రెండు రోజులుగా 400ల్లో ఉన్న మరణాల సంఖ్య నిన్న భారీగా పెరిగి, పరిస్థితి తీవ్రతను కళ్లకు కట్టింది. ఇప్పటివరకు 1,64,110 మంది ఈ వైరస్‌కు బలయ్యారు. నిన్న 10,46,605 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 89,129 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,92,260కి చేరింది. ప్రస్తుతం దేశంలో సెప్టెంబర్ చివరినాటి విజృంభణ కనిపిస్తోంది.

కొద్ది వారాలుగా కరోనా విజృంభిస్తుండటంతో.. క్రియాశీల కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 6,58,909 మంది ఈ వైరస్‌తో బాధపడుతున్నారు. ఫిబ్రవరి ప్రారంభంలో 1.25 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు.. ఇప్పుడు 5 శాతానికి చేరి ఆందోళన కలిగిస్తోంది. ఇక, నిన్న 44,202 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. నిన్నటివరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1.15కోట్లకు పైబడగా.. ఆ రేటు 93.68 శాతానికి చేరింది. రికవరీలు మెరుగ్గా ఉండటమే కాస్త ఊరటనిచ్చే విషయం. 

‘మహా’ విజృంభణ:

కరోనా మహమ్మారి మహారాష్ట్రను తీవ్రఇక్కట్లకు గురిచేస్తోంది. లాక్‌డౌన్ తప్పని పరిస్థితులను కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కరోనా కేసులు, మరణాల్లో సగానికిపైగా వాటా మహారాష్ట్రదే కావడం గమనార్హం. అక్కడ నిన్న 47,913 కొత్త కేసులు వెలుగుచూడగా..481 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. నిన్నటివరకు 29,04,076 మందికి వైరస్ సోకగా..55,379 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క రాష్ట్రంలోనే క్రియాశీల కేసులు నాలుగు లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 24,57,494 మంది కోలుకున్నారు.

ఏడు కోట్ల మందికిపైగా టీకా..

దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న కరోనా టీకా కార్యక్రమం కింద నిన్న 30,93,795 మంది టీకాలు వేయించుకున్నారు. దాంతో ఏప్రిల్‌ రెండు నాటికి కరోనా టీకాలు తీసుకున్నవారి సంఖ్య 7,30,54,295కి చేరింది. ఏప్రిల్ మొదటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారిని కూడా కేంద్రం ఈ కార్యక్రమం కిందికి తీసుకువచ్చి, టీకాలు పంపిణీ చేస్తోంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని