close

తాజా వార్తలు

Updated : 15/04/2021 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా @ 2,00,000

దాదాపు 10రోజుల్లో రెట్టింపైన కేసులు.. 1,000 దాటిన మరణాలు

 14 లక్షలు దాటిన క్రియాశీల కేసులు 

దిల్లీ: భారత్‌లో కరోనా ఉగ్రరూపం ధరించి కల్లోలం సృష్టిస్తోంది. భారీగా ప్రాణాలను హరిస్తోంది. బుధవారం రెండు లక్షలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు సంభవించాయని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

గడిచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,038 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564 కి చేరగా.. 1,73,123 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. రోజువారి కేసుల సంఖ్య దాదాపు 10 రోజుల్లో రెట్టింపు అయ్యాయి.  దేశంలో ప్రస్తుతం 14,71,877 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు పది శాతానికి చేరువై కలవరపెడుతోంది. నిన్న ఒక్కరోజే 93,528 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య కోటీ 24 లక్షలను దాటేసింది. ఫిబ్రవరిలో 97 శాతానికి పెరిగిన రికవరీ రేటు..ఇప్పుడు 88.92 శాతానికి పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా,  ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే లక్షకు పైగా కొత్త కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్ మాత్రమే ఉన్నాయి. గతంలో అమెరికాలో ఒకే రోజు అత్యధికంగా మూడు లక్షలకు పైగా రోజూవారీ కేసులు బయటపడగా.. తాజాగా భారత్‌లో ఒకే రోజు అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య రెండు లక్షలకు పైబడింది. దేశవ్యాప్తంగా మూడు దశల్లో నడుస్తోన్న టీకా కార్యక్రమం కింద నిన్న 33,13,848 మందికి కేంద్రం వ్యాక్సిన్లను అందించింది.  ఇప్పటి వరకు 11,44,93,238 టీకా డోసులను పంపిణీ చేసింది. 

రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు..

మహారాష్ట్రలో కొద్దిరోజులుగా 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 58,952 మందికి కరోనా సోకగా.. 278 మంది మరణించారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, రాజధాని నగరం దిల్లీని కొవిడ్ మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గుట్టలుగా శవాలు పేరుకుపోతున్నాయని, శ్మశానవాటికల్లో జాగా ఖాళీలేదనే వార్తలు కలచిచేస్తున్నాయి. అధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్ కూడా ఇప్పుడు మహారాష్ట్రకు తోడైనట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 20,439 కొత్త కేసులు బయటపడ్డాయి. దిల్లీ పరిస్థితి అలాగే ఉంది. అక్కడ 17,282 మందికి కరోనా సోకింది.  మహారాష్ట్ర(278), చత్తీస్‌గఢ్‌(120), దిల్లీ(104) మరణాలు సంభవించాయి. ప్రభుత్వం పేర్కొంటున్న మృతుల సంఖ్యకు, వాస్తవ పరిస్థితులకు చాలా అంతరం ఉంటుందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 



 

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని