close

తాజా వార్తలు

Updated : 16/04/2021 10:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండోరోజూ రెండు లక్షలకుపైగా కేసులు.. 

2,17,353 కొత్త కేసులు..1,185 మంది మృతి

10 శాతానికి పైగా క్రియాశీల రేటు..ఒక్కరోజే లక్షకు పైగా రికవరీలు

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత సంవత్సర కాలంలో ఎన్నడూ లేని ఉద్ధృతితో ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. మనదేశంలో కరోనా కేసుల వేగం అమెరికా కంటే అధికంగా ఉంది. అగ్రరాజ్యంలో లక్ష నుంచి 2లక్షల కేసులు పెరగడానికి 34 రోజుల సమయం పడితే భారత్‌లో పదిరోజులే పట్టింది.   

తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 14,73,210 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,17,353 కొత్త కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,91,917 చేరింది. నిన్న 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1,74,308 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇక, క్రియాశీల కేసులు 15లక్షలకు పైబడి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ రేటు 10.46శాతానికి పెరిగింది. ఇక నిన్న లక్షమందికి పైగా కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. గడిచిన 24గంటల్లో 1,18,302 మంది కోలుకోగా..మొత్తంగా కోటీ 25లక్షల మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం రికవరీ రేటు 88.31 శాతానికి పడిపోయింది. ఇంతకాలం మహారాష్ట్ర మీద పడగవిప్పిన కరోనా వైరస్ ఇప్పుడు దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌కు విస్తరిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, కేరళలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దిల్లీ ఇప్పటికే వారాంతపు కర్ఫ్యూపై ప్రకటన చేసింది.  

దేశవ్యాప్తంగా నిన్నటివరకు 11,72,23,509 మందికి కేంద్రం టీకాలు అందించింది. నిన్న ఒక్కరోజే 27,30,359 మందికి పంపిణీ చేసింది. అలాగే ఏప్రిల్ 11 నుంచి 14వరకు నిర్వహించిన టీకా ఉత్సవంలో భాగంగా 1.28 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 

సూర్జేవాలా, హర్‌సిమ్రత్ కౌర్‌, దిగ్విజయ్‌ సింగ్‌కు కరోనా..

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలాకు ఈ రోజు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. గత ఐదురోజులుగా తనను కలిసిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరో కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కూడా కరోనా బారిన పడ్డారు. అలాగే శిరోమణి అకాలీదళ్ నేత, మాజీ కేంద్ర మంత్రి హర్‌ సిమ్రత్ కౌర్ బాదల్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్‌ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆమె ట్విటర్ వేదికగా వెల్లడించారు.




 

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని